ఏడేళ్ల వివాహ బంధానికి గుడ్ బై: భర్తతో విడాకులు తీసుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

ఏడేళ్ల వివాహ బంధానికి గుడ్ బై: భర్తతో విడాకులు తీసుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు. ఏడేళ్ల  వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడిపోయారు. తన భర్త కశ్యప్‎తో విడాకులు తీసుకుంటున్నట్లు సైనా నెహ్వాల్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఇన్‎స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టిన సైనా.. డివోర్స్ మ్యాటర్‎ను అభిమానులకు తెలియజేసింది. ఏడేండ్ల వివాహ బంధానికి, 20 ఏండ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని.. ఎంతో ఆలోచించి, చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు సైనా. 

‘‘జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళుతుంది. ఎంతో ఆలోచించి, చర్చించిన తర్వాత కశ్యప్ నేను విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నాం. మేం ఒకరికొకరం మా శాంతి, పెరుగుదల, ప్రశాంతతను ఎంచుకుంటున్నాం. కశ్యప్‌తో నాకు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి. ఈ జ్ఞాపకాలకు నేను కృతజ్ఞురాలుని. ఈ క్లిష్ట ఈ సమయంలో మా గోప్యతను అర్థం చేసుకుని.. మా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ పేర్కొన్నారు సైనా. 

సైనా, కశ్యప్‌ ఇద్దరూ భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్. వీరిద్దరూ భారత ప్రముఖ బ్యాడ్మింటన్‌ ఆటగాడు పుల్లెల గోపిచంద్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సమయంలో అకాడమీలో ఏర్పడ్డ స్నేహం చివరకు ప్రేమగా మారింది. ఇద్దరి మనసులు ఒక్కటి కావడంతో 2018లో పెద్దలను ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కారమేంటో తెలియదు కానీ ఏడేండ్ల తర్వాత వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేశారు. 

పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది సైనా. అయితే.. విడాకుల విషయంపై ఇంకా కశ్యప్ రియాక్ట్ కాకపోవడం గమనార్హం. సైనా, కశ్యప్ అన్యోన్యంగానే ఉండేవారు. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు కూడా ఎప్పుడు బయటకు రాలేదు. కానీ సడెన్‎గా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి అందరికి షాకిచ్చారు ఈ బ్యాడ్మింటన్ జోడి. 

సైనా, కశ్యప్ కెరీర్:

భారత బ్యాడ్మింటన్‎లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న సైనా నెహ్వాల్ రెండుసార్లు కామన్వెల్త్‌ చాంపియన్‌గా నిలిచారు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి ప్రపంచదేశాల ముందు భారత జెండా రెపరెపలాడించారు. 2015లో మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌ 1 ర్యాంక్‌ సాధించి.. భారత్ తరుఫున మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించారు. 2016 నుంచి సైనా కెరీర్ ఒడిదుడుకులకు గురైంది.

 సైనాను గాయాలు వెంటాడాయి. గాయాలు, ఫామ్ లేమితో  కెరీర్ ప్రమాదంలో పడ్డ సమయంలో కశ్యప్ ఆమెకు అండగా నిలిచాడు. 2019 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో కశ్వప్ మార్గదర్శకత్వంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధును ఓడించింది సైనా. ఇక, సైనా చివరిసారిగా 2023 జూన్‌‎లో ప్రొఫెషనల్‌ సర్క్యూట్‌లో ఆడారు. ఇక కశ్యప్‌ 2014లో కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించారు. 2024లో ఆటకు వీడ్కోలు పలికిన కశ్యప్.. ఆ తర్వాత కోచింగ్‌ ప్రారంభించారు.