సేవ్ ఎల్బీ నగర్’ పేరుతో 48 గంటల నిరాహార దీక్ష

సేవ్ ఎల్బీ నగర్’ పేరుతో 48 గంటల నిరాహార దీక్ష
  • యువత మత్తులో నేరాలు చేస్తున్నా పట్టింపు లేదు :
  • సామ రంగారెడ్డి సేవ్ ఎల్బీ నగర్’ పేరుతో 48 గంటల నిరాహార దీక్ష
  • నందనవనం బాధితురాలిని ఆదుకోవాలని డిమాండ్

ఎల్​బీనగర్, వెలుగు: రాష్ట్రంలో యువత మత్తుకు బానిసలై నేరాలు చేస్తూ జైళ్ల పాలవుతుంటే.. బీఆర్ఎస్ సర్కార్ మాత్రం ఆమ్దానే ఎజెండాగా బెల్ట్ షాప్​లను నడుపుతోందని బీజేపీ రంగారెడ్డి జిల్లా  అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. డ్రగ్స్, బెల్ట్ షాపులు, గంజాయి రహిత తెలంగాణగా మార్చాలని, నందనవనం బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆయన ఎల్ బీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 48 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ.. ఎల్​బీ నగర్​లో గంజాయి, లిక్కర్​24 గంటలు దొరుకుతున్నాయని, వాటితో ఎంతో భవిష్యత్తు ఉన్న యువత పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 తాగడానికి డబ్బులు లేక రోడ్లపై దోపిడీలు, చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యేకు కబ్జాల మీద ఉన్న చిత్త శుద్ధి యువత భవిష్యత్ పై లేదన్నారు. నందనవనం బాదితురాలిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రంగారెడ్డి దీక్షకు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు, పలువురు దళిత, బహుజన సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. గ్రేటర్ సిటీలో లా అండ్ ఆర్డర్ దారి తప్పుతోందని మురళీధర్ రావు మండిపడ్డారు. రౌడీ షీటర్లను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే, మంత్రులు ప్రోత్సహించడం వల్ల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు నందికొండ గీతారెడ్డి, రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రెసిడెంట్ కృష్ణవేణి, రాష్ట్ర నాయకులు చింతల సురేందర్ యాదవ్, దళిత సంఘం నాయకుడు బరిగల గురువయ్య పాల్గొన్నారు.
-