సెక్యూరిటీ గార్డ్​గా  సర్పంచ్.. 

సెక్యూరిటీ గార్డ్​గా  సర్పంచ్.. 
  • సర్కారు నుంచి బిల్లులు రాక పొలం అమ్ముకున్నడు
  • నిజామాబాద్ ​జిల్లా ఆరేపల్లిలో దళిత సర్పంచ్ ​బతుకు పోరాటం

నిజామాబాద్, వెలుగు: చేసిన పనులకు సర్కారు బిల్లులు ఇవ్వకపోవడంతో ఓ సర్పంచ్​ సెక్యూరిటీ గార్డుగా మారాడు. ఉదయం సర్పంచ్​గా పని చేస్తూ.. రాత్రి అపార్ట్​మెంట్ ​వాచ్​మన్​గా డ్యూటీ చేస్తున్నారు. నిజామాబాద్ ​జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఆరేపల్లి గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వ్​అయింది. సర్పంచ్ పదవికి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో లక్కీడిప్​ద్వారా ఇరుసు మల్లేశ్​ను 2019లో సర్పంచ్ గా ఎన్నుకున్నారు. గ్రామ జనాభా 434. గ్రామ పంచాయతీకి స్టేట్​ఫైనాన్స్​కమిషన్​నుంచి జనాభా ప్రాతిపాదికన నెలకు రూ.37 వేలు వస్తాయి. అయితే ఈ నిధులు పంచాయతీ కరెంట్​చార్జీలు, సిబ్బంది జీతాలకే సరిపోతున్నాయి. గ్రామాభివృద్ధిలో భాగంగా మల్లేశ్​కంపోస్ట్​షెడ్,​ వైకుంఠధామం నిర్మాణానికి, పల్లెప్రగతిలో పారిశుధ్య పనులకు సొంత నిధులు వెచ్చించారు. ఇందుకోసం రూ. 3.1 లక్షల వరకు అప్పు చేశారు. సర్కారు ఎంతకీ బిల్లులు మంజూరు చేయకపోవడం, మరోవైపు వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక మల్లేశ్​తన రెండెకరాల్లో అర ఎకరం పొలం అమ్మి రూ.2.5 లక్షల అప్పు చెల్లించారు. మరోవైపు సర్పంచ్​గౌరవ వేతనం రూ.5 వేలు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. దీంతో పూట గడవడమే గగనమయింది. గత్యంతరం లేక పార్ట్​టైమ్​గా రూ. 8 వేల జీతానికి రాత్రివేళ నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని అపార్ట్​మెంట్​లో సెక్యూరిటీ గార్డ్​ గా నైటీ డ్యూటీ చేస్తున్నారు.