- పోలీసులను ప్రశ్నించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
మెదక్, వెలుగు: ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే బాధ్యులపై కేసు పెట్టాలి కానీ, ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు పెడతారా? అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పోలీసులపై ఫైర్ అయ్యారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్ లో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మెదక్ పట్టణంలో జరిగిన ఘటనలో ఎస్సీల మీద అట్రాసిటీ కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే అంశంపై దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ పట్టణంలోని నవాపేటలో జరిగిన ఘటనలో అట్రాసిటీ కేసు నమోదు చేసి, జైలుకు పంపిన వారిలో ఆరుగురు ఎస్సీలు ఉన్నారని తెలిపారు.
చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీల మీద అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపడం సరైంది కాదన్నారు. పోలీసుల తీరుతో చట్టం అభాసుపాలు అవుతోందన్నారు. కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కారు మీద దాడి చేస్తే కేసు పెట్టొద్దని తాను చెప్పనని.. కానీ, ఎస్సీల మీద అట్రాసిటీ కేసు పెట్టడం తప్పన్నారు. ఎస్సీల మీద కేసు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కేసులు, భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని, బాధితులకు పరిహారానికి సంబంధించి రూ.1.20 కోట్లు రావాల్సి ఉందని, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి మార్చి 31 లోపు నిధులు మంజూరయ్యేలా చూస్తానని చెప్పారు.
ఎస్సీలపై అట్రాసిటీ కేసుపై డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కారుపై దాడి ఘటనలో సెక్షన్ 307తో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశామని తెలిపారు. ఆ కేసులో ఎస్సీలతో పాటు ఇతరులు కూడా ఉన్నారన్నారు. చార్జి షీట్ దాఖలు చేసే సమయంలో ఎస్సీల మీద అట్రాసిటీ కేసు తొలగిస్తామని చెప్పారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ నీలిమ పాల్గొన్నారు.
