రైతుల ఉసురు పోసుకుంటున్రు!

రైతుల ఉసురు పోసుకుంటున్రు!
  •     గతేడాది కాటన్​ సీడ్​ సాగు చేసిన రైతులకు బకాయిలు చెల్లించని కంపెనీలు
  •     ప్రభుత్వం ఆదేశించినా రూ.200 కోట్లు ఇంకా పెండింగ్
  •     ఈ ఏడాది పంటకు ఎప్పుడు ఇస్తారోనని గద్వాల జిల్లా రైతుల ఆవేదన
  •     మళ్లీ తెరపైకి బైలాటరల్​ అగ్రిమెంట్

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్​ కాటన్​ పండించే రైతులను కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయి. రైతులకు, ఆర్గనైజర్లకు సీడ్  కంపెనీలు గత ఏడాదికి సంబంధించిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు. రూ.200 కోట్లు సీడ్ కంపెనీలు ఇవ్వాల్సి ఉందని, వాటిని ఇప్పించాలని కలెక్టర్, ఎస్పీలకు ఆర్గనైజర్లు ఫిర్యాదు చేశారు. 

గత ఏడాదికి సంబంధించిన డబ్బులు రాక పోగా, ఈ ఏడాది సాగు చేసిన పంటకు డబ్బులు ఎప్పుడు ఇస్తారని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ ఏడాది పంట సాగు చేసిన  రైతులకు ఆర్గనైజర్లు పెట్టుబడి కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే సీడ్  కంపెనీలు డబ్బులు చెల్లించక పోవడంతో ఆర్గనైజర్లు ద్వైపాక్షిక అగ్రిమెంట్ ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు.

 సీడ్​ కంపెనీ, ఆర్గనైజర్, రైతుల మధ్య అగ్రిమెంట్  చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. గత కొన్నేండ్ల నుంచి అగ్రిమెంట్  చేసుకోవాలనే డిమాండ్  ఉన్నప్పటికీ ఆర్గనైజర్లు, సీడ్​ కంపెనీలు అడ్డు తగులుతూ వచ్చాయి. ఇప్పుడు వారే అగ్రిమెంట్  చేసుకోవాలని పేర్కొనడంపై రైతులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు ఎగ్గొట్టేందుకు ఆర్గనైజర్లు ఈ ప్లాన్  చేస్తున్నారని అంటున్నారు.

ప్రతి ఏటా రూ.వెయ్యి కోట్ల టర్నోవర్..

జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్  బిజినెస్  టర్నోవర్​ ప్రతి ఏటా రూ. వెయ్యి కోట్లు ఉంటుంది. ప్రతి రైతు తనకున్న పొలంలో అర ఎకరం నుంచి 5 ఎకరాల వరకు సీడ్  పంటను సాగు చేస్తారు. ఈ ఏడాది జిల్లాలో 60 వేల ఎకరాల్లో సీడ్​ పత్తిని సాగు చేశారు.

గత ఏడాది డబ్బులు ఇయ్యలే..

గత ఏడాది రైతులు పండించిన సీడ్  పంటకు కొన్ని కంపెనీలు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు. రూ. వెయ్యి కోట్లలో రూ.800 కోట్ల వరకు చెల్లించగా, మరో రూ.200 కోట్లు రావాల్సి ఉంది. సీడ్  కంపెనీలు డబ్బులు ఇవ్వకుండా వేధించడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో విడతల వారీగా రూ.800 కోట్లు చెల్లించారు. పెండింగ్​ డబ్బులు చెల్లించాలని గతంలో అగ్రికల్చర్  మినిస్టర్ కు కంప్లైంట్  చేసిన ఆర్గనైజర్లు, ఇటీవల కలెక్టర్, ఎస్పీల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు.

తెరపైకి అగ్రిమెంట్..

15 ఏండ్ల నుంచి కంపెనీతో రైతులు అగ్రిమెంట్  చేసుకోవాలనే డిమాండ్  ఉంది. కానీ, అటు కంపెనీలు, ఇటు ఆర్గనైజర్లు సీడ్  పండించే రైతుతో అగ్రిమెంట్  చేసుకోలేదు. సీడ్  కంపెనీలు రైతులకు డబ్బులు ఇవ్వకుండా మొండికేయడంతో.. ఈసారి అగ్రిమెంట్ వ్యవహారాన్ని ఆర్గనైజర్లు తెరపైకి తీసుకొచ్చారు. అగ్రిమెంట్  చేసుకుంటే కంపెనీ వాళ్లు డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆర్గనైజర్లు తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. 

ఇలా రైతుల డబ్బులు ఎగ్గొట్టేందుకు కుట్ర చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇదిలాఉంటే ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి ఆర్గనైజర్లు, సీడ్  కంపెనీలు రైతులకు పెట్టుబడి కింద అడ్వాన్స్  ఇవ్వలేదు. మరోవైపు రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని కూడా హామీ ఇవ్వకపోవడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది పంటలో ఎంత కొనుగోలు చేస్తారు? రైతులకు పేమెంట్  ఎప్పుడు ఇస్తారు? అనే వ్యవహారం తేలాల్సి ఉంది.

ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం..

సీడ్​ కాటన్​ సాగు చేసిన రైతులకు రూ.200 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఆర్గనైజర్లు కలెక్టర్ కు కంప్లైంట్  చేశారు. సీడ్  కంపెనీలు, ఆర్గనైజర్ల వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటాం.- లక్ష్మీనారాయణ, అడిషనల్  కలెక్టర్, గద్వాల