కామారెడ్డి, వెలుగు : సీపీఐ సీనియర్ నాయకుడు, అడ్వకేట్ వీఎల్.నర్సింహారెడ్డి సోమవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీపీఐ జిల్లా కార్యదర్శిగా, ఏఐటీయూసీ రాష్ర్ట సీనియర్ నాయకుడిగా పని చేశారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. కామారెడ్డిలో హమాలీలకు ఇండ్ల స్థలాలు, బతుకమ్మ కుంటలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించటంలో కీలక పాత్ర పోషించారు. కార్మికుల పక్షాన అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కామారెడ్డి డిగ్రీ కాలేజీ ఆస్తుల పరిరక్షణ పోరాటంలో చురుకుగా పాల్గొని ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో కీలకంగా వ్యవహరించారు. పేదలు, కార్మికుల పక్షాన వకీలుగా కేసులు వాదించారు. ఆయన మృతికి బార్ అసోసియేషన్, అడ్వకేట్లు నివాళులర్పించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మృతదేహాన్ని ఉంచారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్.దశరథ్, సహాయ కార్యదర్శి బాల్‌రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.చంద్రశేఖర్‌తో పాటు, పలు సంఘాల ప్రతినిధులు, కార్మికులు ఆమన మృతదేహానికి నివాళులర్పించారు. ప్రభుత్వ సహాదారు షబ్బీర్‌అలీ నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.
