అనుమతి లేకుండా జడ్జి ఛాంబర్‌‌‌‌‌‌‌‌లోకి పిటిషనర్..హైకోర్టులో షాకింగ్ ఘటన

అనుమతి లేకుండా జడ్జి ఛాంబర్‌‌‌‌‌‌‌‌లోకి పిటిషనర్..హైకోర్టులో షాకింగ్ ఘటన
  • తనకు నచ్చిన తీర్పు ఇవ్వలేదని దురుసు ప్రవర్తన 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టులో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ కేసులోని కక్షిదారుడు అనుమతి లేకుండా డైరెక్ట్ గా  న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఛాంబర్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు. తన అప్పీల్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను ఎందుకు కొట్టివేశారని.. రివ్యూ పిటిషన్‌‌‌‌‌‌‌‌లోనూ స్టే ఎందుకు ఇవ్వరని పేర్కొంటూ జడ్జీతో దురుసుగా ప్రవర్తించాడు. అంబర్‌‌‌‌‌‌‌‌పేటకు చెందిన చెన్నకృష్ణారెడ్డి అనే కక్షిదారుడు.. 2008లో దాఖలు చేసిన సివిల్ సూట్‌‌‌‌‌‌‌‌ కేసుకు అప్పీల్ పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశాడు. 

దాన్ని కోర్టు కొట్టివేయడంతోపాటు రివ్యూ పిటిషన్‌‌‌‌‌‌‌‌లో స్టే ఆర్డర్ ఇవ్వలేదు. దాంతో చెన్నకృష్ణారెడ్డి.. పార్టీ ఇన్ పర్సన్‌‌‌‌‌‌‌‌గా (న్యాయవాది లేకుండా స్వయంగా వాదనలు వినిపిస్తూ) రివ్యూ పిటిషన్‌‌‌‌‌‌‌‌లో తనకు అనుకూలంగా స్టే ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతను జడ్జిని బెదిరించే ధోరణిలో మాట్లాడుతూ.. తాను ఎవరి మాటా విననని, తన ఒత్తిడి వల్లే కేసులో ప్రత్యర్థి గుండెపోటుతో చనిపోయాడని తెలిపాడు. దాంతో న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కక్షిదారుడు నేరుగా జడ్జి ఛాంబర్‌‌‌‌‌‌‌‌లోకి రాకూడదని, విషయం కోర్టు హాల్లోనే విచారిస్తామని జస్టిస్ భీమపాక స్పష్టం చేశారు.ఛాంబర్ నుంచి బయటకు పంపించిన తర్వాత కోర్టు హాల్లో  కేసు విచారణ జరిగింది. అక్కడ కూడా చెన్నకృష్ణారెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక మండిపడ్డారు. కక్షిదారుడు సీనియర్ సిటిజన్ కాబట్టి ధిక్కరణ చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.  చెన్నకృష్ణారెడ్డి బెదిరింపు ధోరణిలో మాట్లాడడంతో జస్టిస్ భీమపాక కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రివ్యూ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను ప్రధాన న్యాయమూర్తి వద్ద ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.