సైలెంట్ గా రిలీజై... కలెక్షన్స్ కొల్లగొట్టి...

సైలెంట్ గా రిలీజై... కలెక్షన్స్ కొల్లగొట్టి...

1975.. ఆగస్ట్ 15.. అందరూ ఇండిపెండెన్స్ డే మూడ్‌లో ఉన్నారు. అప్పుడే ఓ సినిమా సైలెంట్‌గా విడుదలయ్యింది. సెన్సేషన్ క్రియేట్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో సగర్వంగా నిలిచిపోయింది. ఇప్పటికీ అది యాక్టర్లకు డ్రీమ్ ప్రాజెక్ట్. గ్రేట్ ఫిల్మ్ మేకర్స్‌ని తయారుచేసే సబ్జెక్ట్.ఆ సినిమా మరేదో కాదు.. షోలే. ఇంకో మూడేళ్లలో ఈ సినిమాకి యాభయ్యేళ్లు నిండుతాయి. కానీ ఇంకో యాభయ్యేళ్లయినా ఈ సినిమా సృష్టించిన వైబ్రేషన్స్ మాత్రం అలానే ఉంటాయి. ఎందుకంటే అది షోలే కాబట్టి. ఇంతవరకు దానికి సాటి, పోటీ లేదు కాబట్టి. 

ఏముంది ఇందులో..

వీరూ, జై చిల్లర దొంగలు. ఓ కేసులో జైలుకు వెళ్తారు. అక్కడ్నుంచి వాళ్లని విడిపించిన రిటైర్డ్ పోలీసాఫీసర్ ఠాకూర్.. డెకాయిట్ గబ్బర్‌‌ సింగ్‌ని పట్టుకోవాలంటూ వాళ్లో ఓ డీల్ కుదుర్చుకుంటాడు. ఓరోజు వాళ్ల ఊరిపై గబ్బర్ మనుషులు దాడి చేస్తారు. వాళ్లని వీరూ, జై తరిమి కొడతారు. పక్కనే తుపాకి ఉండి కూడా ఠాకూర్‌‌ తమకి సాయం చేయకపోవడంతో కోపమొచ్చి వెళ్లిపోవాలనుకుంటారిద్దరూ. దాంతో తన గురించిన నిజాన్ని బయటపెడతాడు ఠాకూర్. కొన్నేళ్ల క్రితం గబ్బర్ తన కుటుంబం మొత్తాన్నీ చంపేసి తన చేతులు నరికేశాడని చెబుతూ అప్పటి వరకు కప్పుకున్న శాలువా తీసేసి మొండి శరీరాన్ని చూపిస్తాడు. అది చూసి జై, వీరూలిద్దరూ చలించిపోతారు. గబ్బర్‌‌కి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. అయితే గబ్బర్ ముఠా వీరూని, అతని ప్రేయసి బసంతిని బంధిస్తారు. వాళ్లిద్దరినీ జై విడిపిస్తాడు. ఎదురుదాడి చేసిన గబ్బర్ గ్యాంగ్ చేతుల్లో గాయపడి చనిపోతాడు. స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేకపోయిన వీరూ గబ్బర్‌‌ని అంతం చేయబోతే ఠాకూర్‌‌ అడ్డుపడి గబ్బర్ చేతుల్ని నరికేస్తాడు. పోలీసులు గబ్బర్‌‌ని అరెస్ట్ చేస్తారు. జై అంత్యక్రియలు పూర్తి చేసి బసంతితో కలిసి వీరూ వెళ్లిపోతాడు. 

ఇదీ కథ. దీన్ని విన్నప్పుడు.. ఏముంది దీనిలో, మామూలు కథే కదా అన్నారు చాలామంది. కానీ దాన్ని తెరపై చూసినప్పుడు మాత్రం నోట మాట రాలేదు వారికి. ఒక సాధారణ కథని ఇంత కట్టిపడేసేలా తీయొచ్చా అని ఆశ్చర్యపోయారు. హీరోలిద్దరి స్నేహం.. హేమమాలిని గ్లామర్.. సంజీవ్ కుమార్‌ పాత్రలోని ఎమోషన్.. విలన్‌ క్యారెక్టర్‌‌లోని వెరైటీ.. జయబాధురి పాత్రలోని ఇన్నోసెన్స్.. అన్నిటినీ సమపాళ్లలో కూర్చారు రచయితలు సలీమ్ ఖాన్, జావెద్ అఖ్తర్. వాటిని  అంతే అందంగా తెరకెక్కించారు రమేష్ సిప్పీ. ఏమీ లేదంటూ అందరూ పెదవి విరిచిన కథలో ఎంత ఉందో చూపించి బ్లాక్ బస్టర్‌‌ కొట్టారు. ఈ మూవీకి రైటర్స్‌గా పని చేసినందుకు సలీమ్, జావెద్‌లకి పదివేలు రెమ్యునరేషన్‌గా ఇచ్చారు. ఆ రోజుల్లో ఎవరికీ అంత ఇచ్చేవారు కాదు. మొదటిసారి భారీ రెమ్యునరేషన్ తీసుకున్నది వీళ్లే. వాళ్ల అద్భుతమైన నేరేషన్‌కి అది చాలా తక్కువేనని నిర్మాత జీపీ సిప్పీ అనుకోవడమే అందుకు కారణం. 

పాత్రలు తెచ్చిన తంటాలు

‘షోలే’ సినిమాలో ప్రతి పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయితే మూవీ తెరపైకి వెళ్లకముందు యాక్టర్ల విషయంలో చాలా గజిబిజి అయ్యింది. జై పాత్రకి మొదట శత్రుఘ్న సిన్హాని అనుకున్నారు డైరెక్టర్ రమేష్ సిప్పీ. కానీ ఆయన కంటే అమితాబ్ బాగుంటారని రైటర్ సలీమ్ సలహా ఇచ్చారు. దానికి రమేష్ ఒప్పుకోలేదు. దాంతో ధర్మేంద్ర రంగంలోకి దిగి ఆయన్ని కన్విన్స్ చేశారు. ఠాకూర్ పాత్రకి దిలీప్‌ కుమార్‌‌ని అడిగారు. ఆయన నో అనడంతో సంజీవ్ కుమార్‌‌ని సంప్రదించారు. అయితే కథ విన్న తర్వాత తనకి గబ్బర్ ఇవ్వమని సంజీవ్ అడిగారు. కావాలంటే తన పళ్లను నల్లగా మార్చేసుకుంటానని, గుండు గీయించుకుంటానని కూడా అన్నారు. కానీ దర్శకుడు ఒప్పుకోలేదు. ఠాకూర్‌‌ పాత్రకి ఒప్పించారు. తాను తీసిన చాలా సినిమాల్లో నటించిన ప్రాణ్ పేరును కూడా కొందరు సూచించినా.. సంజీవ్ అయితేనే బెటరని రమేష్ ఫీలయ్యారు. మరోవైపు ఠాకూర్ పాత్రని ధర్మేంద్ర ఇష్టపడ్డారు. సినిమాకి గబ్బర్, ఠాకూర్‌‌లే ఇంపార్టెంట్ అని ఆయనకి తెలుసు. అందుకే తనకది కావాలన్నారు. కానీ వీరూ పాత్రనే ధర్మేంద్రకి ఆఫర్ చేశారు రమేష్. 

మనసు పెట్టి తీస్తే..

ఈ సినిమా ప్లానింగ్ ఒకెత్తు. ఎగ్జిక్యూషన్ మరొకెత్తు. టీమ్ మొత్తం మనసు లగ్నం చేసి.. ప్రాణం పెట్టి పని చేశారు. ఒక సీన్లో అమితాబ్ మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తుంటే జయా బచ్చన్ దీపాలు వెలిగించాలి. ఆ సన్నివేశాన్ని సూర్యస్తమయ సమయంలోనే తీయాలని, అది కూడా అటు సన్‌సెట్‌కి ఇటు నైట్‌కి మధ్య ఉండే టైమ్ కావాలని డీవోపీ దివేచా అన్నారు. ఇరవై రోజులు కష్టపడితే తప్ప ఆయన అనుకున్నట్టుగా ఆ సీన్ రాలేదట. ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ అంతం చేసే సీన్‌ని మూడు షెడ్యూళ్లలో ఇరవై మూడు రోజుల పాటు షూట్ చేశారు. వీరూ వాటర్ ట్యాంక్ ఎక్కి సూసైడ్ చేసుకుంటానని బెదిరించే సీన్‌ మొదట స్క్రిప్ట్‌లో లేదు. ఓ కారులో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ ఆలోచన రావడంతో తన అసిస్టెంట్‌కి సీన్ చెప్పారు జావెద్ అఖ్తర్. అది పేపర్‌‌ మీద పెట్టకుండానే ఆ సీన్‌ని తెరకెక్కించేశారు. అలాగే సూపర్ హిట్ సాంగ్ ‘మెహబూబా మెహబూబా’ కూడా మొదట ప్లాన్‌లో లేదు. గ్రీక్ సింగర్ డెమీ రూసో ‘సే యు లవ్‌మీ’ పాటని లండన్‌లో విన్న రమేష్, ఆయన భార్య గీత.. కావాలని పట్టుబట్టి ఆర్డీ బర్మన్‌తో అలాంటి పాట చేయించుకున్నారు. సూర్మా భూపాలీ పాత్ర మొదట సినిమాలో లేదు. రషెస్ చూసిన తర్వాత సినిమా మరీ సీరియస్‌గా అనిపించడంతో కాస్త కామిక్ టచ్ ఇవ్వడానికని సూర్మా పాత్రను యాడ్ చేశారు. ఇలా ప్రతిదీ పర్‌‌ఫెక్ట్గా రావాలని తపించారు. ఎప్పటికప్పుడు తమ ఐడియాస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్లారు. అందుకే అనుకున్నదానికంటే బెటర్ ప్రొడక్ట్ని ప్రేక్షకులకు అందించగలిగారు.  అయితే కొన్ని విషయాల్లో కాపీ కూడా జరిగింది. సినిమాలో జై ఎప్పుడూ ఓ కాయిన్‌ని ఫ్లిప్ చేస్తుంటాడు. అది ‘గార్డెన్ ఆఫ్ ఈవిల్’ మూవీ నుంచి లేపేశారు. ఠాకూర్ ఫ్యామిలీని గబ్బర్‌‌ ఊచకోత కోసే సన్నివేశం ‘ఒన్స్ అపాన్‌ ఎ టైమ్ ఇన్ ద వెస్ట్’ మూవీలోది. ఇలా ఏవో కొన్ని సీన్స్ విషయంలో ఇలా జరిగినా.. మిగతాదంతా పక్కా ప్లానింగ్‌తో, ఓన్ టాలెంట్‌తోనే తీశారు.

గబ్బర్.. ఓ వండర్

ఒక సినిమా అందులోని లీడ్ యాక్టర్ల కారణంగా గుర్తుండిపోవడం ఎప్పుడూ జరిగేదే. అయితే ‘షోలే’లో హీరో హీరోయిన్ల కంటే విలన్‌ క్యారెక్టరే ఎక్కువ పాపులర్ కావడం విశేషం. నిజానికి గబ్బర్ సింగ్ కేవలం తొమ్మిది సీన్లలోనే ఉంటాడు. కానీ ‘షోలే’ అంటే అతనే అనుకునేంతగా క్లిక్ అయ్యాడు. ఆ క్యారెక్టర్‌‌ని రాయడంలో సలీమ్ ఖాన్‌కి స్పెషల్ ఇంటరెస్ట్ ఉంది. ఆయన తండ్రి ఓ పోలీస్. గబ్బర్ అనే డేంజరస్ క్రిమినల్ గురించి ఆయన కథలు కథలుగా చెబుతుండేవారట. అతని దగ్గర చాలా కుక్కలు ఉండేవని, పోలీసుల ముక్కులు కోసి వాటికి ఆహారంగా వేసేవాడని.. ఇలా ఎంతో వర్ణించేవారట. అవన్నీ సలీమ్ మనసులో ముద్రపడిపోయాయి. వాటి నుంచే గబ్బర్ పుట్టుకొచ్చాడు. ఠాకూర్ బల్‌దేవ్ సింగ్ పాత్ర కూడా నిజంగా ఉంది. ఆయన సలీమ్‌కి మావగారు. రిటైర్డ్ సోల్జర్. కానీ కథలో పోలీసుగా మార్చి రాశారు. ఆ పాత్ర కూడా చాలా మెప్పించింది. కానీ గబ్బర్ రోల్ ఊహించనంత పాపులర్ అయిపోయింది. ఆ పాత్రకి మొదట డ్యానీ డెంజొప్పాని అనుకున్నారు. కానీ ఆయన వేరే మూవీకి కమిటవ్వడంతో ఆ చాన్స్ అంజద్ ఖాన్‌కి దక్కింది. ఈ సినిమాకి ముందు డెకాయిట్ పాత్రలన్నీ పంచె కట్టుతో కనిపిస్తుండేవి. అదీ చంబల్ ప్రాంతంలో వాళ్లు ఉంటారన్నట్టు చూపించేవారు. దాన్ని జావెద్ అఖ్తర్ మార్చి పారేశారు. గబ్బర్‌‌కి మిలిటరీ డ్రెస్‌లాంటిది వేశారు. చంబల్‌ ప్రస్తావనే లేకుండా అతను వేరే ఎక్కడో ఉన్నట్టు చూపించారు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, సరికొత్త డైలాగ్ డెలివరీతో గబ్బర్‌‌ని అందరికీ ప్రీతిపాత్రుణ్ని చేశారు. ఈ పాత్ర ఎంత పాపులర్ అయ్యిందంటే.. ఒక ప్రముఖ బిస్కెట్ కంపెనీ అంజద్ ఖాన్‌తో యాడ్ షూట్ చేసింది. గబ్బర్ సింగ్ తమ బిస్కట్లు తినడం వల్లే అంత బలవంతుడయ్యాడంటూ ప్రచారం చేసుకుంది. ఒక విలన్‌ ఇలా యాడ్‌లో నటించడం మన దేశంలో అదే మొదటిసారి. ప్రతినాయకుడి పాత్రకి రాంగ్ పర్సన్‌ని సెలెక్ట్ చేశారని, అతని వాయిస్ కూడా పీలగా ఉందని, సినిమా కచ్చితంగా పోతుందని మొదట్లో చాలామంది అన్నారు. కానీ ఆ పాత్రే సినిమాకి కేరాఫ్‌గా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. గబ్బర్‌‌కి సంబంధించిన సీన్స్ని బెంగళూరు దగ్గర్లోని రామనగర ప్రాంతంలో తీశారు. ‘షోలే’ తర్వాత దర్శకుడి గౌరవార్థం ఆ పేరును సిప్పీ నగర్‌‌గా మార్చేశారంటే ఈ సినిమా, గబ్బర్ పాత్ర వేసిన ముద్ర ఎలాంటిదో చెప్పొచ్చు. 

రీల్‌ వర్సెస్ రియల్‌

ఈ సినిమాలో నటించిన జంటలు రియల్‌గానూ జోడీలు కావడం విశేషం. హేమామాలినిని ధర్మేంద్ర, జయబాధురిని అమితాబ్ పెళ్లాడారు. అయితే జయ, అమితాబ్‌ల పెళ్లి మూవీ మొదలవ్వడానికి మూడు నాలుగు నెలల ముందే జరిగింది. జయ కన్సీవ్ అవ్వడంతో షూటింగ్ కూడా లేటయ్యింది. శ్వేత పుట్టాక సెట్‌లో అడుగు పెట్టారు జయ. సినిమా పూర్తయ్యి రిలీజయ్యే సమయానికి ఆమె కడుపులో అభిషేక్ పెరుగుతున్నాడు. అలా ఈ సినిమా వారి జీవితాల్లో మెమొరబుల్ అయ్యింది. ఇక ధర్మేంద్ర, హేమ అంతకు ముందు చేసిన ‘సీత ఔర్ గీత’ టైమ్‌లోనే లవ్‌లో పడ్డారు. ఈ సినిమా చేసేటప్పుడు వారి ప్రేమ బలపడింది. హేమతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు షాట్స్ పాడు చేయమని లైట్ బోయ్స్కి లంచం ఇచ్చేవారట ధర్మేంద్ర. ఇంకో విషయం ఏమిటంటే.. అంతకు కొన్నాళ్ల ముందే హేమకి సంజీవ్ కుమార్‌‌ ప్రపోజ్ చేశారు. కానీ ఆమె ధర్మేంద్రను ప్రేమించారు. ఠాకూర్ పాత్ర తనకి కావాలని పట్టుబట్టినప్పుడు ఈ విషయాన్ని అడ్డుపెట్టుకునే ధరమ్‌జీని కన్విన్స్ చేశారట డైరెక్టర్ సిప్పీ. వీరూ పాత్ర కనుక సంజీవ్ కుమార్ చేస్తే చివర్లో హేమా మాలిని తనకే దక్కుతుందని ఆయన అన్నారట. దాంతో వాళ్లిద్దరినీ జంటగా చూడటం ఇష్టం లేక వీరూ పాత్ర చేయడానికి ధర్మేంద్ర కన్విన్స్ అయిపోయారట. ఈ మూవీ రిలీజయ్యాక అయిదేళ్లకి వీళ్ల పెళ్లి జరిగింది.

తిరుగులేని రికార్డ్‌

ఈ సినిమాని కోటి రూపాయలతో ప్లాన్ చేశారు. చివరికి మూడు కోట్లు తేలింది. అప్పట్లో ఇది చాలా పెద్ద బడ్జెట్. అయినా కాంప్రమైజ్ కాకుండా తీశారు. అయితే అంతా అయ్యాక క్లైమాక్స్ విషయంలో కష్టాలు ఎదురయ్యాయి. ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం చివర్లో ఠాకూర్‌‌ తన కాళ్లతో గబ్బర్ పీకమీద తొక్కి తొక్కి చంపేస్తాడు. అది చాలా వయొలెంట్‌గా ఉందంటూ సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పింది. ఎమర్జెన్సీ టైమ్ కావడంతో ఒక పోలీసు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సీన్‌ని యాక్సెప్ట్ చేయలేమంది. కానీ మార్చడానికి దర్శకుడు ఒప్పుకోకపోవడంతో రిలీజ్ కొన్ని రోజులు ఆగిపోయింది. మరింత లేటవడం ఇష్టం లేక చివరికి డైరెక్టర్ చల్లబడ్డారు. రష్యాలో ఉన్న సంజీవ్ కుమార్‌‌ని అప్పటికప్పుడు బెంగళూరు రప్పించి వేరే క్లైమాక్స్ షూట్ చేశారు. ఎడిటింగ్‌ విషయంలోనూ చాలా కసరత్తు జరిగింది. మూడు లక్షల అడుగుల ఫిల్మ్ తయారయ్యింది. దాన్ని ఇరవై వేల అడుగులకి కుదించాల్సి వచ్చింది. కత్తెరకు బాగా పదును పెట్టాక కూడా మూడు గంటల ఇరవై నిమిషాల నిడివితో షోలే విడుదలయింది. తొలి రోజునే నెగిటివ్ టాక్. ఇక ఈ సినిమా పని అయిపోయిందనుకున్నారు సిప్పీ. రెండు మూడు రోజులైనా నెగిటివ్‌ టాక్ వినిపిస్తూ ఉండటంతో  రీషూట్ చేసి విడుదల చేయడం బెటరేమోనని కూడా ఫీలయ్యారు. కానీ వారం తిరిగేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. మౌత్‌ టాక్‌తో థియేటర్లు నిండాయి. కలెక్షన్లు పెరిగాయి. యే దోస్తీ, మెహబూబా లాంటి పాటలు ఊపేశాయి. కిత్‌నే ఆద్మీథే.. బసంతీ ఇన్ కుత్తోంకే సామ్‌నే మత్ నాచ్‌నా.. జో డర్‌‌గయా సమ్‌ఝో మర్‌‌గయా లాంటి డైలాగ్స్ విజిల్స్ వేయించాయి. ముంబై మినర్వా థియేటర్లో ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఐదేళ్ల పాటు ఈ సినిమా ఆడింది. వంద థియేటర్లలో ఇరవై అయిదు వారాల పాటు సత్తా చాటింది. టికెట్ ధర పది రూపాయలు మాత్రమే ఉన్న ఆ రోజుల్లోనే కోట్లు కొల్లగొట్టింది. రష్యాతో సహా చాలా దేశాల్లో సంచలన విజయం దక్కింది. 1994లో ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ మూవీ వచ్చేవరకు ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే.  

ఇలా చెప్పుకుంటూ పోతే ‘షోలే’ విశేషాలు ఎంతకీ తరగవు. మన దేశపు మొదటి 70 ఎంఎం స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిల్మ్ ఇది. 1999లో బీబీసీ దీన్ని ఫిల్మ్ ఆఫ్ ద మిలీనియంగా ప్రకటించింది. బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ వారి టాప్ టెన్ ఇండియన్ ఫిల్మ్స్ లిస్టులో మొదటి స్థానం సంపాదించింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ స్టార్టయ్యి యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ యాభయ్యేళ్లలో వచ్చిన అత్యుత్తమ సినిమాగా ‘షోలే’ని సెలెక్ట్ చేశారు. 2014లో త్రీడీ ఫార్మాట్‌లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. షోలే అడ్వెంచర్స్ పేరుతో యానిమేటెడ్ సిరీస్ని కూడా తెరకెక్కించారు. ఇన్ని ఘనతలు సాధించింది కనుకనే విడుదలై నలభై అయిదేళ్లు దాటినా ఇప్పటికీ ‘షోలే’ ఎవర్‌‌గ్రీన్‌ బ్లాక్ బస్టర్‌‌ అనిపించుకుంటోంది. గబ్బర్, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పలు సినిమాల ద్వారా ఆ క్యారెక్టర్లని గుర్తు చేస్తూనే ఉంది. ఇండియన్ సినిమా చరిత్రలో తిరుగులేని స్థానం నాదంటూ సగర్వంగా ప్రకటించుకుంటోంది