సిద్దిపేటలో ప్రారంభానికి సిద్ధమైన జిల్లా జైలు

సిద్దిపేటలో ప్రారంభానికి సిద్ధమైన జిల్లా జైలు
  • హై సెక్యూరిటీతో బ్యారక్ ల  నిర్మాణం
  • 30 ఎకరాల విస్తీర్ణం రూ.9 కోట్ల వ్యయం
  • 400 మందికి పైగా ఖైదీల సామర్థ్యం
  • ఆధునిక సదుపాయాల కల్పన

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణ శివార్లలో  నిర్మిస్తున్న  జిల్లా జైలు ప్రారంభానికి సిద్ధమైంది.  ఎన్సాన్ పల్లి సమీపంలో  30 ఎకరాల విస్తీర్ణంలో రూ.9 కోట్ల వ్యయంతో  ఆధునిక  సౌకర్యాలతో జిల్లా జైలు నిర్మాణం పూర్తయింది. రెండేళ్ల కింద జైలు నిర్మాణ  పనులు ప్రారంభమై ప్రస్తుతం ముగింపు దశకు చేరుతుండడంతో ఓపెనింగ్ కు అధికారులు సిద్ధం చేస్తున్నారు.

 ప్రస్తుతం సిద్దిపేట పట్టణంలోని ఆర్డీవో  ఆఫీసు పక్కన ఉన్న జిల్లా జైలు అరకొర సౌకర్యాలతో  ఉంది.  ఖైదీలకు సరిపోక పోవడంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పట్టణ శివార్లలో జైలు నిర్మాణ పనులను ప్రారంభించారు. అంతకు ముందు కరీంనగర్ రోడ్డులో టూ టౌన్ పీఎస్​సమీపంలో నిర్మించాలని సంకల్పించినా జైలు నిబంధనలు అడ్డుగా మారడంతో దాన్ని ఇక్కడకు మార్చారు.

హై సెక్యూరిటీ

మొత్తం జిల్లా జైలులో 8 బ్యారక్ లను ఏర్పాటు చేయగా అందులో ఒకటి మహిళలకు కేటాయించారు. ఇందులో 60 మంది ఖైదీలు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. మిగిలిన 7 బ్యారక్ లను పురుషుల కోసం ఏర్పాటు చేయగా వాటిలో మొత్తం 350 మందికి పైగా ఖైదీలు ఉండే విధంగా నిర్మించారు. జైలు చుట్టూ  నాలుగు వైపులా నలభై అడుగుల ఎత్తులో వాచ్ టవర్లను ఏర్పాటు చేసి రాత్రి పగలు పహారా కాసే విధంగా ఏర్పాట్లు చేశారు.  ఖైదీలు అనారోగ్యానికి గురైతే చికిత్స కోసం ప్రత్యేక బెడ్స్, లైబ్రరీ, ఖైదీల పనుల నిర్మహణ కోసం నాలుగు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు.  

ఖైదీలు పారిపోకుండా ఏడు మీటర్ల ఎత్తైన గోడ నిర్మించారు. దానికి విద్యుత్ వైర్ ఫెన్సింగ్ తో పాటు ప్రత్యేక వైర్ ను ఏర్పాటు చేశారు. ఒక డిప్యూటీ సూపరింటెండెంట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ తో పాటు 16 విభాగాలకు సంబంధించి 66 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. సిబ్బందికి జైలు లోపల క్వార్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు పూర్తికావడంతో ఈ నెలాఖరులో ప్రారంభించే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

ఆధునిక సదుపాయాల కల్పన

కొత్తగా నిర్మిస్తున్న జిల్లా జైలులో ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నారు. పటిష్ట నిఘా ఉండే విధంగా రూపకల్పన చేసి నిర్మాణం ప్రారంభించారు. పాత జైలులో సరైన సదుపాయాలు లేక ఖైదీలను సంగారెడ్డి లేదా హైదరాబాద్ కు తరలించేవారు. ప్రస్తుతం కొత్త జైలులో 400 మందకి పైగా ఖైదీలు పురుష, మహిళ ఖైదీలకు వేర్వేరుగా బ్యారాక్​లు నిర్మించారు. భవిష్యత్​లో ఖైదీల సంఖ్య పెరిగినా ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండే విధంగా నిర్మాణ పనులను పూర్తి చేశారు.