
- సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో40కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి, వెలుగు: సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు కార్మికులు మరణించారు. పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్
తీసుకుంటున్న వాళ్లిద్దరూ గురువారం చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 40కి చేరింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 32 మంది కార్మికులు పటాన్‌చెరులోని ధ్రువ, రామచంద్రపురంలోని అర్చన, ప్రణమ్, ఫినిషియా, హైదరాబాద్‌లోని యశోద, కిమ్స్ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు 18 మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించగా, మరో 22 డెడ్‌బాడీలను గుర్తిం చాల్సి ఉంది.
కార్మికుల కుటుంబసభ్యుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన డాక్టర్లు.. డీఎన్‌ఏ టెస్టులు చేస్తున్నారు. ఆ రిపోర్టుల ఆధారంగా డెడ్‌బాడీలను అప్పగించనున్నారు. కాగా, ఫ్యాక్టరీ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను జాగ్రత్తగా తొలగిస్తూ మృతదేహాలను బయటకు తెచ్చేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి.
మాంసపు ముద్దలుగా మారిన డెడ్‌బాడీలను ప్లాస్టిక్ కవర్లలో వేసి డీఎన్ఏ టెస్టులకు పంపిస్తున్నాయి. ఇప్పటి వరకు వెలికితీసిన శిథిలాలను పునఃపరిశీలన కోసం పక్కనే ఉన్న ఖాళీ స్థలానికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 10 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వాళ్లు శిథిలాల కిందే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.