
- పరారీలో ఇద్దరు నిందితులు.. పోలీసుల గాలింపు
లండన్: బ్రిటన్‌లోని ఒల్డ్‌బరీ సిటీలో దారుణం జరిగింది. మన దేశానికి చెందిన సిక్కు యువతి(20)పై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక, ఆమెపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. " నీ సొంత దేశానికి తిరిగి వెళ్లిపో " అని వార్నింగ్ ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మంగళవారం ఉదయం 8:30 గంటలకు ఓల్డ్‌బరీలోని టేమ్ రోడ్ ఏరియాలో ఉన్న ఓ ఒక పార్క్ వద్ద సిక్కు యువతిని ఇద్దరు యూకే పౌరులు అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టామని..ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు.
ఫోరెన్సిక్ బృందం కూడా దర్యాప్తులో భాగమైందని చెప్పారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం.. దారుణానికి పాల్పడిన ఇద్దరూ యూకే పౌరులేనని వెల్లడించారు. అందులో ఒకరు గుండుతో డార్క్ కలర్ స్వెట్‌షర్ట్ ధరించగా..మరొకరు గ్రే కలర్ టాప్ ధరించినట్లు పోలీసులు వివరించారు. అనుమానంగా ఎవరైనా కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
సిక్కు ప్రజల్లో ఆందోళన
ఘటనపై బ్రిటన్‌లోని సిక్కు సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో జాత్యహంకార ఘటనలు పెరగడంపై సిక్కు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేబర్ పార్టీ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ ఈ దాడిని ఖండించారు. ఇది జాత్యహంకార చర్యేనని మండిపడ్డారు.
సిక్కు సమాజానికి న్యాయం జరిగేలా, వారి భద్రతను మెరుగుపరచడానికి పోలీసులతో కలిసి పనిచేస్తానని పేర్కొంటూ ట్వీట్ చేశారు. మరో ఎంపీ జాస్ అత్వాల్ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. యువతిపై జరిగిన దారుణాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని.. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.