AI వాడకం అంటే ఇలా: దిగ్గజ సింగర్ మొహమ్మద్ రఫీకి సోను నిగమ్ అపురూప నివాళి.. ఎమోషనల్ అవుతున్న ఆడియన్స్

AI వాడకం అంటే ఇలా: దిగ్గజ సింగర్ మొహమ్మద్ రఫీకి సోను నిగమ్ అపురూప నివాళి.. ఎమోషనల్ అవుతున్న ఆడియన్స్

ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ (Sonu Nigam) క్రేజీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కువగా హిందీ సినిమాల్లో పాటలు పాడినప్పటికీ తెలుగు సాంగ్స్ తో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బెంగాలీ, కన్నడ, తమిళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తుళు, మైథిలీ, నేపాలీ లాంటి అనేక భాషల్లో పాటలు పాడుతూ సోను ఎంతో గుర్తింపు పొందాడు.

లేటెస్ట్ విషయానికి వస్తే.. గురువారం (నవంబర్ 20, 2025న) కశ్మీర్‌, శ్రీనగర్‌లోని దాల్ సరస్సు వద్ద ఇండియన్ లెజెండరీ సింగర్ మహమ్మద్ రఫీ100వ జయంతి సందర్భంగా ఈవెంట్ నిర్వహించారు. ఈ సంగీత కచేరీలో ఇండియా లెజండరీ సింగర్ మహమ్మద్ రఫీకి (Late Mohammed Rafi), సింగర్ సోను నిగమ్ హృదయపూర్వక నివాళులర్పించారు.

అయితే, సింగర్ సోను నిగమ్ ఈ సారి తన మధురమైన గొంతుతో కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి సింగర్ మొహమ్మద్ రఫీ గొంతును తిరిగి సృష్టించారు. తన ప్రదర్శన ద్వారా 15,000 మందికి పైగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఇందులో AI ఉపయోగించి ప్రత్యక్ష యుగళగీతం పాడగా, నోస్టాల్జియా మరియు ఎమోషనల్ ఫీలింగ్స్ని అందంగా మిళితం చేసిన క్షణం ప్రేక్షకులు ఉప్పొంగిపోయారు. ఇపుడు ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఎంతోమంది ఎమోషనల్ అవుతున్నారు.

ఈ క్రమంలో, భారతీయ సంగీతానికి ఆత్మ అయిన మొహమ్మద్ రఫీ 100వ జయంతి సందర్భంగా సోను నిగమ్ అర్పించిన ఈ ప్రదర్శన ఎప్పటికీ నిలిచిపోతుంది అని సంగీత అభిమానులు ట్వీట్స్ పెడుతున్నారు. "హృదయపూర్వక నివాళి, ఆ కాశ్మీరీ రాత్రికి సరికొత్త జీవం పోసింది" అని కొందరు కామెంట్స్ పెడుతుండగా, "AI ని ఇలా ఉపయోగించాలి" అని మరొకరు కామెంట్ చేశారు.

రాడికో ఖైతాన్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, శ్రీ అమర్ సిన్హా స్పందిస్తూ.. "సోను నిగమ్ అద్భుతమైన కళాత్మకత, అతనిలోని భావోద్వేగ లోతు మా 'ది స్పిరిట్ ఆఫ్ కాశ్మీర్' విలువలకు అద్దం పడుతున్నాయి" అని  తెలిపారు. ఈ భాగస్వామ్యం కేవలం వ్యాపారానికి సంబంధించింది కాదు, శ్రేష్ఠత మరియు ప్రామాణికతను పంచుకునే ఒక వేడుక అని నిరూపించినట్లు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ ​(AI) ఓ వైపు అభివృధి చెందుతుంటే, మరోవైపు ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. కొంతమంది  AI వాడకంతో ఫేక్​ వీడియోలను సృష్టిస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలతో వ్యక్తిగత అనుభవాలను చెప్తూ AI మోసాలు, దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో AI ని ఉపయోగించి ఇలాంటి మధుర క్షణాలను సృష్టించాలని, మంచి కోసం వాడాలని అంటున్నారు. ఇటీవలే AI వాయిస్‌‌‌‌తో మ్యూజిక్ డైరెక్టర్ చక్రికి ట్రిబ్యూట్‌‌‌‌గా ‘తు మేరా లవర్‌‌‌‌‌‌‌‌’ పాట ఫేమస్ అయినా విషయం తెలిసిందే. ఈ మాస్ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా, భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ అందించారు. AIని ఇలా మంచి పని కోసం వాడిన మాస్ జాతర మేకర్స్ ఆలోచనను చాలా మంది అభినందించారు. 

దిగ్గజ గాయకుడు, మహమ్మద్ రఫీ..

భారతదేశంలోని గొప్ప గాయకులలో ఒకరిగా పరిగణించబడ్డారు. ఆయన బహుముఖ ప్రజ్ఞ, స్వర శ్రేణికి ప్రసిద్ధి చెందారు. తన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో హిందీ, ఉర్దూ మరియు ఇతర ప్రాంతీయ భాషలలో వేలాది పాటలు పాడారు. సుమారు 25,000 కంటే ఎక్కువ పాటలు పాడారు. లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఆర్‌డి బర్మన్, మరియు శంకర్-జైకిషన్ వంటి ప్రముఖ సంగీత దర్శకులతో పనిచేశారు.

అతని కెరీర్‌లో ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులుతో పాటుగా జాతీయ అవార్డు సైతం అందుకున్నారు. 1967లో, భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. ఇకపోతే, రఫీ డిసెంబర్ 24, 1924న బ్రిటిష్ ఇండియాలోని కోట్లా సుల్తాన్ సింగ్ పంజాబ్‌లో జన్మించారు. ఆయన 1980 జూలై 31న 55 సంవత్సరాల వయస్సులో మరణించారు.

సోను నిగమ్ విషయానికి వస్తే.. 51 ఏళ్ల సోను నిగమ్ 35 సంవత్సరాలకు పైగా పాటలు పాడుతున్నారు. ఇప్పటివరకు అతను 32 కి పైగా భాషలలో పాడారు. ఆయనకు 2022 లో పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. అనేక దేశీ పాప్ ఆల్బమ్స్ కూడా విడుదల చేశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు. భారతీయ గాయకుల్లో అత్యధిక పారితోషికం అందుకునే వారిలో సోను ఒకడు.