రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు.. నార్సింగి మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ అమలు

రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు.. నార్సింగి మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ అమలు

మెదక్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్ కే వీ వై)   కింద భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు వాటి ఫలితాలతో కూడిన కార్డులు అందించాలని నిర్ణయించింది.  2024 – 25 సంవత్సరంలో ఈ పథకం ప్రారంభించగా ప్రతి జిల్లాకు ఒక మండలాన్ని  పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో నార్సింగి మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేశారు. 

 రైతులు పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలన్న ఉద్దేశ్యంతో మోతాదుకు మించి  ఎరువులు ఉపయోగిస్తూ ఉంటారు.  దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరగడంతో పాటు, భూసారం దెబ్బతింటోందని,  భూసార పరీక్షలు నిర్వహించుకుని భూమి స్వభావానికి అనుగుణంగా అనువైన పంటలను సాగుచేస్తే లాభాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.   గతంలో    భూసార పరీక్షలు రెగ్యులర్ గా నిర్వహించేవారు. 

కానీ, కొన్నేళ్లుగా అవి బంద్ అయ్యాయి. రైతు వేదికల్లో మినీ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని లీడర్లు చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో రైతులు ఎవరికితోచిన పంట  వారు సాగు చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నూతన కార్యక్రమాన్ని చేపట్టింది.   దీని కోసం ఇప్పటికే నార్సింగిలో మండల వ్యవసాయ అధికారి (ఎం ఏ వో) ల ఆధ్వర్యంలో క్లస్టర్  వ్యవసాయ విస్తీర్ణ అధికారులు (ఏ ఈ వో) రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించారు.  ప్రతి 4.20 ఎకరాలకు ఒక శాంపిల్ చొప్పున సేకరించారు. మట్టి నమూనాలను భూసార పరీక్ష కేంద్రంలో శాస్త్రీయ పద్ధతిలో పరీక్షించారు. 

భూమి స్వభావం ఏమిటి, పీ హెచ్ వాల్యూ, జింక్, నైట్రేట్, ఫాస్పరస్ ఏ స్థాయిలో ఉందనేది గుర్తించారు. ఈ విషయాలను పొందు పర్చడంతో పాటు, ఆ నెల ఎలాంటి పంటల సాగుకు అనుకూలం, ఏ ఏ ఎరువులు ఏ మోతాదులో వేయాలో పేర్కొంటూ సాయిల్ హెల్త్ కార్డులు తయారు చేసి సంబంధిత రైతులకు అందజేశారు. నార్సింగి మండలంలో మొత్తం 1,974 మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. 

ఫలితాల ఆధారంగా : పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన నార్సింగి మండలంలో భూసార పరీక్ష కార్డుల పంపిణీ పూర్తి కాగా, భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. భూమి స్వభావం బట్టి అనువైన పంటలు ఏవో రైతులకు సూచిస్తూ అవే పంటలు సాగు చేసేలా చూస్తున్నామని, ఎరువులు కూడా ఇష్టారీతిగా వేయకుండా అవసరమైన మోతాదులోనే వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నామని  ఏఈవో విజృంభణ తెలిపారు. 

ఈ సారి మూడు మండలాల్లో...

2025 - 26 సంవత్సరానికి గాను రాష్ట్రీయ కృషి వికాస్ యోజన   కింద రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో పాపన్నపేట, హవేలీ ఘనపూర్, కొల్చారం మండలాలను ఎంపిక చేశారు.  పాపన్నపేట, హవేలీ ఘనపూర్ మండలంలో అందరూ రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహించ నుండగా కొల్చారం మండలంలో మాత్రం ఆర్గానిక్ ఫామింగ్ చేసే రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించనున్నారు.