అప్పుడు విమర్శించారు.. ఇప్పుడు పొత్తు అంటున్నారు..

అప్పుడు విమర్శించారు.. ఇప్పుడు పొత్తు అంటున్నారు..

అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న తరుణంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో బీజేపీని అవమానించిన చంద్రబాబు.. ఇప్పుడు పొత్తు కోసం ఎందుకు పాకులాడుతున్నారని ప్రశ్నించారు.

చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసొచ్చారని.. పొత్తులపై వారే నిర్ణయం తీసుకుంటారన్నారని సోము వీర్రాజు అన్నారు. తమది మంచి సిద్దాంతాలు ఉన్న జాతీయపార్టీ అని.. పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందన్నారు. తాను  మాట్లాడే మాటల్లో తప్పులు ఉంటే చెప్పాలని.. చంద్రబాబు వస్తే ఆయన్నే అడుగుతాను అన్నారు.

చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని.. ప్రతీ విషయంలో కేంద్రాన్ని విమర్శించటం సరికాదని సోము వీర్రాజు హితవు పలికారు. దమ్ముంటే.. చంద్రబాబు ముందుకు వస్తే ఒకే వేదికపై చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. అప్పట్లో చంద్రబాబే ప్రత్యేక హోదా వద్దన్నారని.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని సభలు  పెడుతున్న చంద్రబాబును అప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారో ప్రశ్నిస్తున్నారా? అని నిలదీశారు. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

నోటాతో పోటీపడే పార్టీ బీజేపీ  అన్న టీడీపీ అధినేత చంద్రబాబు  ఇప్పుడు తమతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు. బీజేపీని అవమానించేలా మాట్లాడారని.. ఇప్పుడు తమతో పొత్తుకు ఎలా పాకులాడుతున్నారో చెప్పాలన్నారు. తమ పార్టీని అవమానించిన వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా చేస్తామన్నారు.

ALSO READ: గ్రాఫ్ బాగాలేకపోతే పీకేస్తా.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్

ఏ పార్టీ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందో ? ఏ పార్టీ సింగిల్ గా వస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి వస్తాయని కొందరంటుంటే.. జనసేన పొత్తు ఉండబోదని కొందరు, జనసేన- బీజేపీ పొత్తు ఉంటుందని మరికొందరి నుండి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో తమకు పొత్తు ఆలోచనే ఉండబోదని తెలిపారు.