కర్ణాటకలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సోనియా గాంధీ

కర్ణాటకలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సోనియా గాంధీ
  • రేపు మైసూర్లో రాహుల్ తోపాటు సోనియా జోడో యాత్ర 

మైసూరు: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కర్ణాటక రాష్ట్రంలో జరిగిన దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. మైసూరు జిల్లా బేగూరులోని భీమన్ కొల్లి ఆలయంలో సోనియా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనయుడు రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఆమె కర్ణాటకకు వచ్చారు. దసరా ఉత్సవాల సందర్భంగా రాహుల్ పాదయాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించగా.. ఇవాళ పండుగ సందర్భంగా మైసూరు జిల్లా హెచ్ డీ కోట అసెంబ్లీ నియోజకవర్గంలోని భీమన్ కొల్లి ఆలయంలో దసరా పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయంలో సోనియా కొద్దిసేపు గడిపారు. సోనియాకు వేద ఆశీర్వచనంతోపాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రేపు రాహుల్ తోపాటు పాదయాత్రలో సోనియా పాల్గొననున్నారు. 

త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ యాత్రను మరింత బలోపేతం చేసేలా సోనియా పాదయాత్రలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెల 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 21 రోజులపాటు 511 కిలోమీటర్లు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. ఇప్పుడు కర్ణాటకలో పాదయాత్ర కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా చేపట్టిన రాహుల్ పాదయాత్ర సుదీర్ఘంగా ఐదు నెలలపాటు కొనసాగనుంది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా మొత్తం 3750 కిలోమీటర్లు సాగి జమ్మూ కశ్మీర్ లో యాత్ర ముగియనుంది.