- రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్నరు: సోనియా గాంధీ
- బీజేపీలో చేరాలని ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నరు
- మోదీ నియంత పాలనకు చరమగీతం పాడాలని పిలుపు
జైపూర్: మన దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ మంటగలుపుతున్నారని కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ మండిపడ్డారు. ‘‘మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నది. ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నారు” అని ఆరోపించారు. మోదీ తనను తాను గొప్పవాడిగా భావిస్తూ, నియంత పాలన కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ నియంత పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. శనివారం రాజస్థాన్ లోని జైపూర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సోనియా మాట్లాడారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని, బీజేపీలో చేరాలని ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నదని ఆరోపించారు. ‘‘ఈ దేశం కొంతమందికే చెందినది కాదు. ఇది అందరిది. దేశం కోసం మన పూర్వీకులు రక్తం చిందించారు” అని అన్నారు. మోదీ పాలనలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ మాట్లాడుతూ.. రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై కేంద్రం దాడి చేస్తున్నదని అన్నారు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘‘అవినీతిపరులందరినీ బీజేపీ చేర్చుకుంటున్నది. ఆ నేతలు బీజేపీలో చేరినంక క్లీన్ అయిపోతున్నారు. వాళ్లపై ఉన్న కేసుల గురించి అందరూ మర్చిపోతున్నారు” అని అన్నారు. ‘‘కొంతమంది వ్యాపారవేత్తలకు మన దేశ సంపదనంతా బీజేపీ ప్రభుత్వం అప్పగించింది. వాళ్లకు సంబంధించిన వేల కోట్ల లోన్లను మాఫీ చేసింది. కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదు” అని ఫైర్ అయ్యారు.
మోదీ అబద్ధాలకోరు: ఖర్గే
ప్రధాని మోదీ పెద్ద అబద్ధాలకోరు అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఎన్నో హామీలిచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ‘‘మన దేశ భూభాగాలను చైనా ఆక్రమించుకుంటున్నది. మరోవైపు బార్డర్ లో మన దేశ పల్లెల పేర్లు మారుస్తున్నది. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు” అని ఫైర్ అయ్యారు. ‘‘తనకు 56 ఇంచుల ఛాతీ ఉన్నదని మోదీ చెబుతున్నారు. అది 56 ఉన్నదో లేక 55, 54 ఉన్నదో మాకు తెలియదు కదా.. మేం టైలర్ ను పిలిపిస్తాం. అప్పుడు కొలిపిస్తే అసలు సంగతి తెలుస్తది” అని విమర్శించారు.