
- 29,907 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
బాల్కొండ, వెలుగు: శ్రీరాంసాగర్ ఎగువన గోదావరి బేసిన్‌లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు 54,000 క్యూసెక్కుల వరద రాగా, సోమవారం ఉదయం 6 గంటలకు 54,187 క్యూసెక్కులకు పెరిగింది. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి, 8 గేట్ల ద్వారా 24,640 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇన్ ఫ్లో 41,867 క్యూసెక్కులకు తగ్గడంతో, గేట్ల సంఖ్యను 4కి తగ్గించి 12,320 క్యూసెక్కుల నీటిని వదిలారు. మధ్యాహ్నం ఇన్‌ఫ్లో 36,000 క్యూసెక్కులకు పడిపోవడంతో, 2 గేట్ల ద్వారా 6,160 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఇన్ ఫ్లో 29,907 క్యూసెక్కులకే పరిమితమవడంతో వరద గేట్లను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 1090.90 అడుగులు, నీటి నిల్వ 80.53 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు ఈఈ చక్రపాణి తెలిపారు. వరద కెనాల్‌కు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20,000 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 3,500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లు ద్వారా 4,500 క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 150 క్యూసెక్కులు, అలీసాగర్ కు 360 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కోసం 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అవిరిరూపంలో 666 క్యూసెక్కుల నీరు వృథాగా వెళ్తోంది.