టీచర్లకు పునరావాస కేంద్రంగా ఎస్సీఈఆర్టీ

టీచర్లకు పునరావాస కేంద్రంగా ఎస్సీఈఆర్టీ

హైదరాబాద్, వెలుగు:  స్టూడెంట్లకు సిలబస్​తయారు చేయడం, టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఏర్పాటైన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) కొందరు టీచర్లకు పునరావాస కేంద్రంగా మారింది. ఎస్సీఈఆర్టీలో ప్రొఫెసర్, లెక్చరర్, ఇతర కీలకమైన పోస్టులు ఏండ్లుగా ఖాళీగా ఉండటంతో ఆయా పోస్టుల్లో సీఎంవో, మంత్రుల సిఫార్సులతో చేరిపోతున్నారు. డిప్యుటేషన్, ఫారిన్ సర్వీస్, ఓడీల పేర్లతో కొందరు ఏండ్ల తరబడి అక్కడే అడ్డా వేశారు. మరికొందరు పేరుకు టీచర్లే అయినా.. పాఠాలు చెప్పడం మరిచిపోయారు. లెక్చరర్ల స్థానంలో ఎస్టీజీలకు సైతం పోస్టింగ్ లు ఇస్తున్నారంటే ఎస్సీఈఆర్టీ పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చని అధికారులే చెప్తున్నారు. 

సిలబస్ మార్పులకే పరిమితం 

రాష్ట్రంలో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకూ అన్ని మీడియంలకు సంబంధించిన సిలబస్​ను ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్సీఈఆర్టీ రూపొందిస్తోంది. డీఈడీ, ఇతర ప్రీ ఎడ్యుకేషన్, పండిట్ కోర్సులకూ సిలబస్ తయారుచేస్తుంది. టీచర్లకు, స్కూళ్లకు అకడమిక్  గైడెన్స్​నూ అందిస్తోంది. అలాగే పలు సబ్జెక్టుల్లో టీచింగ్ మెథడ్స్, రీసెర్చ్ నిర్వహించి, స్టూడెంట్లు, టీచర్లకు ఉపయోగపడేలా వాటిని మెరుగుపర్చాలి. కానీ తెలంగాణ ఎస్సీఈఆర్టీలో ఈ రీసెర్చ్ కార్యకలాపాలే పెద్దగా కనిపించడం లేదు. ఇప్పటికే ఉన్న సిలబస్​లో అప్పుడప్పుడూ కొంతమార్పులు చేస్తుంటారు. దీంట్లోనూ ఏటా ‘ఎరాటమ్’ పేరుతో తప్పులను గుర్తిస్తూనే ఉంటారు. ఇందుకోసం ఏటా లక్షల్లో ఖర్చు చేస్తుంటారు.   

ట్రైనింగ్ కూడా నామమాత్రమే  

మూడేండ్ల కింద 8, 9, 10 క్లాసుల బయోలజీ పుస్తకాల్లో మనిషి పుట్టుకపైన సైన్స్​లోనూ క్లారిటీ లేదని, కోడి ముందా గుడ్డు ముందా.. అనే దానికి ఆన్సర్ లేదని, పిల్లల్ని కనేందుకే పెండ్లి అని, రాక్ స్టార్లు.. నీళ్లలో ఉప్పు తీశారనీ  రాసేశారు. దీనిపై తీవ్ర విమర్శులు రావడంతో వాటిని తొలగించారు. కానీ ఆ తప్పులకు బాధ్యులైన ఎవ్వరిపైనా చర్యలు తీసుకోలేదు. సీనియర్ ప్రొఫెసర్లు, లెక్చరర్లతో తయారు చేయించాల్సిన పాఠాలను స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలతో తయారు చేస్తే ఇలాంటి తప్పులే వస్తాయని అధికారులు చెప్తున్నారు. ఎస్సీఈఆర్టీలోకి క్వాలిటీ పర్సన్స్​రావడం లేదన్న వాదనలూ ఉన్నాయి. మరోపక్క టీచర్ల ట్రైనింగ్ కూడా నామమాత్రంగా ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. టెట్ నిర్వహణ కూడా ఎస్సీఈఆర్టీదే. అయినా రెగ్యులర్​గా నిర్వహించడం లేదు.

పీజీటీని లెక్చరర్ చేసిన్రు

రంగారెడ్డి జిల్లాలోని ఓ మోడల్ స్కూల్ లో పనిచేసే ఓ మహిళా పీజీటీని ఎస్సీఈఆర్టీలో లెక్చరర్​గా విలీనం చేశారు. వాస్తవానికి సొసైటీ పరిధిలో ఉన్న ఆ టీచర్​ను రెగ్యులర్ ఎంప్లాయీ కింద పరిగణనలోకి తీసుకోరు. అయినా గవర్నమెంట్ బాడీ అయిన ఎస్సీఈఆర్టీలో ఆమెను విలీనం చేశారు. వాస్తవానికి లెక్చరర్​పోస్టుకు పీజీ, ఎంఈడీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ కూడా లేకున్నా పోస్టింగ్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సర్కారు మాత్రం తన పని తాను చేస్తూ పోయింది.   

సప్పుడు చేయని సంఘాలు 

అకడమిక్ అంశాలకు సెంటర్ పాయింట్ అయిన ఎస్సీఈఆర్టీ ఆగమవుతున్నా, టీచర్ల సంఘాలు స్పందించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్లు, ఓడీలు ఇస్తున్నా నోరు మెదపడం లేదు. ఎస్సీఈఆర్టీలో అకడమిక్ మానిటరింగ్ ఆగమవుతున్నా టీచర్ల సంఘాలు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

పైరవీలతో వచ్చి.. పాతుకుపోతున్నరు  

ఎస్సీఈఆర్టీలో చాలా పోస్టులు ఏండ్లుగా ఖాళీగానే ఉన్నాయి. టీచింగ్ కేటగిరీలో ప్రొఫెసర్, లెక్చరర్ ఇతర పోస్టులున్నాయి. కోర్టు కేసు వల్ల  పోస్టులు భర్తీ చేయట్లేదు. మెజార్టీగా డైట్ కాలేజీల్లో,  స్కూళ్లలో పనిచేసే హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, లాంగ్వేజీ పండిట్లే ఉన్నారు. ఎస్జీటీ, లాంగ్వేజీ పండిట్లు ఎస్సీఈఆర్టీ పోస్టులకు అనర్హులు. కానీ అధికారులు అవేవీ పట్టించుకోవడం లేదు. ఈ ఒక్క ఏడాదే ఏకంగా 20 మంది టీచర్లను డిప్యుటేషన్లు, ఓడీలపై నియమించారు. వీరంతా సీఎంవో, మంత్రుల సిఫారసులతో వచ్చిన వారే. కొందరి డిప్యుటేషన్, ఓడీ గడువు పూర్తయినా, ఇక్కడే అడ్డా పెట్టేశారు. హైదరాబాద్​లో పిల్లల చదువు కోసమంటూ వచ్చి, రాజకీయ నాయకులతో పైరవీలు చేయించుకొని ఇక్కడే ఉంటున్నారు. ఇటీవల జీవో 317 ద్వారా దూరప్రాంతాల్లో పోస్టింగ్​లు పొందిన వాళ్లు, స్పౌజ్ కేటగిరిలోని టీచర్లు కూడా ఇక్కడికి వచ్చిన వారిలో ఉన్నారు. ఎస్సీఈఆర్టీలో ఐదేండ్ల సర్వీస్ పూర్తయిన వాళ్లు 17 మంది ఉన్నట్టు అధికారులే చెప్తున్నారు.