IND VS ENG 2025: బ్యాలన్స్ అదిరింది.. బ్యాటింగ్ డెప్త్ పెరిగింది: రెండో టెస్టుకు టీమిండియా ఆర్డర్ ఇదే!

IND VS ENG 2025: బ్యాలన్స్ అదిరింది.. బ్యాటింగ్ డెప్త్ పెరిగింది: రెండో టెస్టుకు టీమిండియా ఆర్డర్ ఇదే!

ఇంగ్లాండ్ తో బుధవారం (జూలై 2) ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మార్పులు భారత జట్టు సమతుల్యంగా ఉండేలా చేశాయి. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ తుది జట్టులో స్థానం సంపాదించారు. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాకు ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చారు. శార్దూల్ ఠాకూర్, సాయి సుదర్శన్ లపై వేటు పడింది. బర్మింగ్‌హామ్‌ వేదికగా ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో టీమిండియా చేసిన ఈ మూడు మార్పులు కలిసి వచ్చేవే. టీమిండియా ప్లేయింగ్ 11 లోకి వచ్చిన ముగ్గురు కూడా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగలరు.

నితీష్ కుమార్ కు ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన రికార్డ్ ఉంది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్వదేశంలో కీలక ఇన్నింగ్స్ లు ఆడి ఆకట్టుకున్నాడు. ఆకాష్ దీప్ సైతం చివర్లో బ్యాట్ ఝుళిపించగలడు. 9 వ స్థానం వరకు టీమిండియా బ్యాటింగ్ డెప్త్ బాగుంది. సాయి సుదర్శన్ స్థానంలో కరుణ్ నాయర్ రెండో టెస్టులో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. టాపార్డర్ లో బ్యాటింగ్ చేయగలిగే కరుణ్.. తనను తాను నిరూపించుకోవడానికి  ఇది చక్కటి అవకాశం. 6, 7, 8 స్థానాల్లో నితీష్, జడేజా, సుందర్ బ్యాటింగ్ వలన బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో జట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు.     

►ALSO READ | IND VS ENG 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. మూడు మార్పులతో టీమిండియా

లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లో భారత లోయర్ ఆర్డర్ విఫలమైంది. తొలి ఇన్నింగ్స్ లో చివరి 41 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ అదే పరిస్థితి. చివరి 31 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 600 పరుగులు భావించినా కనీసం 500 పరుగులు కూడా మన జట్టు చేయలేకపోయింది. రెండో ఇన్నింగ్స్ లో 450 పరుగుల ఆధిక్యం ఖాయమనుకుంటే అనూహ్యంగా కుప్పకూలారు. శార్దూల్ ఠాకూర్, కరుణ్ నాయర్, జడేజా కనీస స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయారు. భారత పరాజయానికి ఇదే ప్రధాన కారణం. సెకండ్ టెస్టులో టీమిండియాకు ఆ సమస్య లేనట్టు కనిపిస్తుంది.