
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ఆవామీ లీగ్ చీఫ్ షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. కోర్టు ధిక్కార కేసులో షేక్ హసీనాకు బంగ్లా న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎండీ గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. హసీనా అరెస్టు లేదా లొంగిపోయిన రోజు నుంచి ఈ శిక్ష అమలులోకి వస్తోందని ఐసీటీ స్పష్టం చేసింది. ఇదే కేసులో హసీనాతో పాటు గోవిందగంజ్‌కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్‌కు కూడా రెండు నెలల జైలు శిక్ష విధించబడింది.
కాగా, 2024 జూలై, ఆగస్ట్‌లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలను షేక్ హసీనా ఉక్కుపాదంతో ఎక్కడికక్కడ అణిచివేశారు. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగి నిరసనకారులు, పోలీసులు మృతి చెందారు. అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది.
ప్రాణ భయంతో షేక్ హసీనా దేశం విడిచిపారిపోయింది. షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. 2024 జూలై, ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను అప్పటి ప్రధాని షేక్ హసీనా క్రూరంగా రంగా అణివేశారని ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి.
ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే బంగ్లా న్యాయస్థానం షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దేశం విడిచిపారిపోయిన హసీనాను రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కలిక ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. షేక్ హసీనా దేశం విడిచిపారిపోయిన తర్వాత ఓ కేసులో ఆమెకు జైలు శిక్ష వేయడం ఇదే తొలిసారి.