కేంద్ర పథకాలకు రాష్ట్రం దూరం.. నష్టపోతున్న లక్షలాది మంది అర్హులు

కేంద్ర పథకాలకు రాష్ట్రం దూరం.. నష్టపోతున్న లక్షలాది మంది అర్హులు
  • కేంద్ర పథకాలకు రాష్ట్రం దూరం
  • నష్టపోతున్న లక్షలాది మంది అర్హులు
  • ఫసల్ బీమా, ఆవాస్ యోజన,సబ్సిడీ లోన్ల లాంటి ముఖ్యమైన స్కీమ్​లను అమలు చేస్తలే 
  • పీఎం కిసాన్​కు రాష్ట్ర స్థాయిలో అప్రూవల్స్ కూడా ఇస్తలే 
  • స్కీమ్​ల అమలు కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి 28 లెటర్లు 
  • అయినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలకు రాష్ట్రం దూరంగా ఉంటోంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆవాస్ యోజన, స్మార్ట్​సిటీస్ మిషన్, ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ లోన్లు, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లాంటి స్కీమ్​లను అమలు చేయడం లేదు. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులు నష్టపోతున్నారు. ఇందులో కొన్ని పథకాలకు పూర్తిగా కేంద్రమే నిధులు సమకూరుస్తుండగా, మరికొన్నింటికి రాష్ట్రం తన వాటా జమ చేసి అమలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్కీమ్​ల అమలు, రాష్ట్ర వాటా విడుదలపై కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. 

సాధారణంగా పథకాలకు ఫండ్స్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లెటర్లు పంపిస్తుంటాయి. కానీ సెంట్రల్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అమలుకు సంబంధించి కేంద్రమే రాష్ట్రానికి లేఖలు రాస్తోంది. సీఎం కేసీఆర్, సీఎస్ సహా ఇతర డిపార్ట్ మెంట్ల అధికారులకు కేంద్రంలోని వివిధ డిపార్ట్ మెంట్ల నుంచి గత ఏడాది కాలంగా ఏకంగా 28 లెటర్లు అందినట్లు తెలిసింది. అయినప్పటికీ రాష్ట్ర సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. మరోవైపు పీఎం కిసాన్ పథకం కూడా రాష్ట్ర రైతులకు అందకుండా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆ స్కీమ్ కోసం రైతులు ఆన్​లైన్​ లో అప్లై చేసుకున్నప్పటికీ, వ్యవసా యశాఖ అప్రూవల్ ఇవ్వకపోవడంతో లక్షలాది మంది లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ కావడం లేదు. 

పంట పరిహారానికి సొంత స్కీమ్ ఏది?

అకాల వర్షాలు, వరదలతో పంట నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తోంది. దీని కింద నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తోంది. ఈ స్కీమ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% చొప్పున ఇన్సూరెన్స్ ప్రీమియం భరించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ అమలైన మొదటి నాలుగేండ్లలో రాష్ట్రంలోని రైతులకు దాదాపు రూ.2,100 కోట్లు పంట నష్టపరిహారం అందింది. లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరింది. 2020-–21 నుంచి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. దీంతో మూడేండ్లుగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదు. దీనిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. ‘‘గుజరాత్​లోనూ ఈ స్కీమ్ అమలు చేయడం లేదు. గుజరాత్ ప్రభుత్వం సొంతంగా క్రాప్ ఇన్సూరెన్స్ ​స్కీమ్ అమలు చేస్తోంది. మేమూ అలాంటి స్కీమ్ తెస్తాం” అని మంత్రులు చెబుతూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్కీమ్ తీసుకురాలేదు.  

స్మార్ట్ సిటీస్ పనులు బంద్..  

స్మార్ట్ సిటీస్ మిషన్‌‌‌‌ను కేంద్రం 2015 జూన్ 25న ప్రారంభించింది. రాష్ట్రంలోని గ్రేటర్​వరంగల్, కరీంనగర్​లో 72 ప్రాజెక్టులకు సంబంధించి రూ.1,533 కోట్ల పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.392 కోట్లు కేంద్రం ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఈ రెండు సిటీలకు సంబంధించి రూ.287 కోట్లే ఖర్చు చేశారు. మిగిలిన రూ.1,246 కోట్లు వాడటం లేదు. వాటికి స్టేట్ వాటా రిలీజ్ చేసి, ఫండ్స్ ​వాడుకోవాల్సి ఉంది. కేంద్రానికి పేరు వస్తుందనే కారణంతోనే రాష్ట్ర సర్కార్ పనులు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.  

ఎస్సీ, ఎస్టీలకు అందని సబ్సిడీలు 

కేంద్రం అంబ్రెల్లా స్కీమ్ కింద పరిశ్రమల ఏర్పాటుకు ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ లోన్లు ఇస్తోంది. ఇందులో అన్ని డిపార్ట్​మెంట్ల నుంచి వివిధ రకాలుగా స్కీమ్​ను బట్టి సబ్సిడీ అందిస్తోంది. ఎంఎస్ఎంఈలకు 25 నుంచి 30 శాతం సబ్సిడీలు అందజేస్తోంది. అయితే దీనిపై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం అవగాహన కల్పించడం లేదు. దళితబంధు పేరుతో కేంద్ర స్కీమ్​ల అమలు, అప్రూవల్స్ పై దృష్టి పెట్టడం లేదు. వీటితో పాటు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లాంటి పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఇండ్లు ఇస్తలేరు.. కేంద్రాన్ని సాయం చెయ్యనిస్తలేరు 

పేదలు ఇండ్లు కట్టుకుంటే ఆర్థిక సాయం అందజేసేందుకు కేంద్రం 2015లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఒక్కో ఇంటి నిర్మాణానికి పల్లెల్లో రూ.72 వేలు, పట్టణాల్లో రూ.1.5 లక్షల చొప్పున సాయం అందజేస్తోంది. అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రభుత్వం ఆ నిధులను డైవర్ట్ చేసింది. పోనీ.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లన్నా అందరికీ ఇచ్చిందా? అంటే అదీ లేదు. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద రాష్ర్టానికి రూ.1,311 కోట్లు వచ్చాయి. లబ్ధిదారుల వివరాలు కేంద్రానికి పంపితే మరో రూ.1,300 కోట్లు వస్తాయి. కానీ వివరాలు పంపడం లేదు. కేంద్రానికి పేరొస్తుందన్న కారణంతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ స్కీమ్ కింద ఏపీలో ఏకంగా 20 లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేసింది.