
- 566 ఎంపీపీలు, జడ్పీటీసీలు
- 5,773 ఎంపీటీసీ స్థానాలు.. 31 జడ్పీలు
- తేలిన లెక్క.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- స్థానిక ఎన్నికల నుంచి మేడ్చల్ జిల్లా ఔట్
- ఎన్నికలకు సిద్ధం కావాలని కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో లోకల్‌బాడీ ఎలక్షన్ ప్రక్రియను పంచాయతీ రాజ్ శాఖ స్పీడప్ చేసింది. ఈ మేరకు ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ, 566 ఎంపీపీ, 566 జడ్పీటీసీ, 31 జడ్పీ స్థానాలు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది.
ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.నల్గొండలో అత్యధికంగా 353, ఆ తర్వాత నిజామాబాద్‌లో 307, అత్యల్పంగా ములుగు జిల్లాలో 83, ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో 109 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 33 ఉండగా.. అత్యల్పంగా ములుగులో 10 ఉన్నాయి. ఎన్నికల మెటీరియల్ సిద్ధం చేయాలని కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ప్రకటన ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలని పేర్కొన్నది.
తగ్గిన ఎంపీటీసీలు..పెరిగిన ఎంపీపీ, జడ్పీటీసీలు
రాష్ట్రంలో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలతోపాటు పంచాయతీలు, వార్డుల లెక్క తేలింది. 2019 ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలు 5,817 ఉండగా.. ప్రస్తుతం 5,773కు తగ్గాయి. ఎంపీపీ లు, జడ్పీటీసీలు 539 ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 566కు చేరింది. గతం కంటే ఎంపీటీసీ స్థానాలు 44 తగ్గగా.. ఎంపీపీలు, జడ్పీటీసీ స్థానాలు మాత్రం 27 వరకు పెరిగాయి. గతంలో 32 జడ్పీ స్థానాలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 31కి పడిపోయింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాలు శివారు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో విలీనం కావడంతో ఈ జిల్లా స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి ఔట్ అయ్యింది. 2019లో 12,848 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 12,778 కి పడిపోయింది. 2019లో గ్రామాల వార్డులు 1,13,136 ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 1,12,694 కు చేరింది.
పోలింగ్ సిబ్బంది డేటా సిద్ధం చేయాలి
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈసీ సూచించింది. రాష్ట్రంలోని జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలం, పంచాయతీలతోపాటు వార్డుల సంఖ్య ఆధారంగా.. పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించింది. అయితే, ప్రభుత్వం మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
మేడ్చల్ జిల్లా పరిషత్ కనుమరుగు
కొత్తగా మున్సిపాలిటీల ఏర్పాటుతో జడ్పీటీసీలు తొలగింపు
మేడ్చల్ జిల్లా శివారు కార్పొరేషన్లలో విలీనమైంది. దీంతో ‘స్థానిక’ఎన్నికల ప్రక్రి య నుంచి మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా ఔటైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2019 ఎన్నికల నాటికి 32 జిల్లా పరిషత్‌లు ఉండగా.. ప్రస్తుతం31 జడ్పీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఈ జిల్లాలో ఐదు మండలాలు, 72 గ్రామాలు ఉండగా.. కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో కలిసిపోయాయి. దీంతో ఈ జిల్లాలో ఇక మీదట స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు.
మేడ్చల్ జిల్లా పరిషత్‌కు ఒకే సారి ఎన్నిక జరగ్గా, అదే మొదటిది, చివరిది కావడం గమనార్హం. జిల్లాలో 4 మాత్రమే జడ్పీటీసీలు ఉండగా ఇందులో ఒకరు జడ్పీ చైర్మన్, మరోకరు వైస్ చైర్మన్ కాగా, మరో ఇద్దరు మాత్రమే జడ్పీటీసీలుగా సమావేశాల్లో కూర్చునేవారు. జడ్పీ మీటింగ్ జరిగిన సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని శాఖల అధికారులు కలిపి నలుగురు జడ్పీటీసీలకు సుమారు 50 మంది అటెండ్ అయ్యేవారు.
జిల్లాల వారీగా ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీల వివరాలు ఇలా
జిల్లా ఎంపీటీసీ
స్థానాలు ఎంపీపీలు, జడ్పీటీసీలు
ఆదిలాబాద్ 166 20
భద్రాద్రి కొత్తగూడెం 233 22
హనుమకొండ 129 12
జగిత్యాల 216 20
జనగామ 134 12
భూపాలపల్లి 109 12
జోగులాంబ గద్వాల 142 13
కామారెడ్డి 233 25
కరీంనగర్ 170 15
ఖమ్మం 283 20
ఆసిఫాబాద్ 127 15
మహబూబాబాద్ 193 18
మహబూబ్ నగర్ 175 16
మంచిర్యాల 129 16
మెదక్ 190 21
ములుగు 83 10
నాగర్‌కర్నూల్ 214 20
నల్గొండ 353 33
నారాయణపేట 136 13
నిర్మల్ 157 18
నిజామాబాద్ 307 31
పెద్దపల్లి 137 13
రాజన్న సిరిసిల్ల 123 12
రంగారెడ్డి 230 21
సంగారెడ్డి 271 26
సిద్దిపేట 230 26
సూర్యాపేట 235 23
వికారాబాద్ 227 20
వనపర్తి 133 15
వరంగల్ 130 11
యాద్రాద్రి భువనగిరి 178 17