జమ్మూ కాశ్మీర్​కు మళ్లీ రాష్ట్ర హోదా.. పునరుద్ధరిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి

జమ్మూ కాశ్మీర్​కు మళ్లీ రాష్ట్ర హోదా..  పునరుద్ధరిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి
  • కొంత టైమ్ కావాలని విజ్ఞప్తి 
  • రేపు కేంద్రం పాజిటివ్ స్టేట్​మెంట్ ఇస్తుంది: సొలిసిటర్ జనరల్
  • ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలన్న సీజేఐ

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ విషయంలో గురువారం ఒక పాజిటివ్ స్టేట్​మెంట్ వెలువడుతుందని సుప్రీం కోర్టుకు కేంద్రం వివరించింది. జమ్మూకాశ్మీర్‌‌‌‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదన్న కేంద్రం.. లడఖ్​కు సంబంధించినంత వరకు యూటీ హోదా మరికొంతకాలం కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఆర్టికల్‌‌‌‌ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. జమ్మూకాశ్మీర్​కు రాష్ట్ర హోదా ఎప్పుడు ఇస్తారని సుప్రీం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. 

రాష్ట్ర హోదా కల్పించేందుకు ఏదైనా కాలపరిమితి ఉందా? అని అడిగింది. అలా ఏమైనా ఉంటే వెంటనే సమర్పించాలని ధర్మాసనం సూచించింది. నాలుగేండ్ల కింద 370 ఆర్టికల్​ను రద్దుచేశారని గుర్తు చేసింది. జాతీయ భద్రతాపరమైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పునర్ ​వ్యవస్థీకరణకు అంగీకరిస్తున్నామని తెలిపింది. కానీ, జమ్మూకాశ్మీర్​లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావడం కూడా ముఖ్యమేనని అభిప్రాయపడింది. ఎప్పటిలోగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తారో చెప్పాలని కోరింది. తర్వాత, కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. గురువారం(రేపు) జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేస్తుందన్నారు.

ఇప్పటికే అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయ్యాయని వివరించారు. లడఖ్​లో రెండు యూనిట్లు ఉన్నాయన్నారు. ఒకటి లేహ్.. మరొకటి కార్గిల్ అని కోర్టుకు తెలిపారు. లేహ్ లో ఎన్నికలు కంప్లీట్ అయ్యాయని, కార్గిల్​లో సెప్టెంబర్​లో ముగుస్తాయని విన్నవించారు. జమ్మూ కాశ్మీర్‌‌‌‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే అంశం ప్రస్తుతం పార్లమెంట్‌‌‌‌లో ఉందని చెప్పారు. కాశ్మీర్‌‌‌‌లో పరిస్థితులు చక్కబడ్డాక ఆ ప్రయత్నాలు మొదలవుతాయని విన్నవించారు.