
- 41ఏ సీఆర్పీసీని దుర్వినియోగం చేస్తున్న పలువురు పోలీసులు
- కేసును బట్టి లంచాలు డిమాండ్.. పది రోజుల్లో ఏసీబీ వలలో ముగ్గురు ఆఫీసర్లు
మంచిర్యాల, వెలుగు: స్టేషన్ బెయిల్ ఇచ్చే అధికారాన్ని కొందరు పోలీస్ ఆఫీసర్లు దుర్వినియోగం చేస్తున్నారు. కేసును బట్టి వేలు, లక్షల్లో లంచాలు మెక్కుతున్నారు. ఇటీవల రాష్ర్టంలో ముగ్గురు ఎస్సైలు స్టేషన్ బెయిల్‌కు పైసలు తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కడం చర్చనీయాంశంగా మారింది. 41ఏ సీఆర్పీసీ(క్రిమినల్ ప్రొసీజర్కోడ్)సెక్షన్‌ను అవకాశంగా తీసుకుని కొందరు ఎస్సైలు, ఎస్ హెచ్ వోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. కేసు తీవ్రతను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా గుంజుతున్నారు. కాదంటే నాన్ బెయిలబుల్ కేసులు ఫైల్చేసి రిమాండ్‌కు పంపిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో నిందితులు ఎంతో కొంత ముట్టజెప్పి బయటకు వస్తున్నారు. రోడ్ యాక్సిడెంట్లు, భూముల గొడవలు, ఇసుక, బొగ్గు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, వరకట్నం వేధింపులు, ఇతర చిన్న చిన్న కేసుల్లో స్టేషన్ బెయిల్‌కు లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినపుడు మాత్రమే విషయం వెలుగులోకి వస్తోంది.
రూ. వేలు, లక్షల డిమాండ్
లారీ ఫైనాన్స్‌కు సంబంధించిన చీటింగ్కేసులో కరీంనగర్జిల్లా బావుపేటకు చెందిన ఇద్దరు నిందితులకు స్టేషన్ బెయిల్‌ఇచ్చేందుకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్ఎస్సై భాస్కర్‌రావు రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. నిందితులు రూ.1.2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకుని ఏసీబీ ఆఫీసర్లకు కంప్లైంట్చేశారు. ఈ మేరకు బుధవారం తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకోగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై భాస్కర్‌రావుతో పాటు డ్రైవర్‌పై కేసు ఫైల్ చేసి నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వికారాబాద్‌జిల్లా పెద్దేముల్ఎస్సై చంద్రశేఖర్ఇసుక ట్రాక్టర్ కేసులో రూ.60 వేలు డిమాండ్ చేసి, రూ.50 వేలు తీసుకుంటూఈ నెల 13న ఏసీబీ వలలో చిక్కాడు. వారం కింద జగిత్యాల ఎస్సై శివకృష్ణ వరకట్నం వేధింపుల కేసులో నలుగురు నిందితులకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు రూ.50 వేలు డిమాండ్ చేశాడు. చివరకు తన డ్రైవర్ ద్వారా రూ.30 వేలు తీసుకోగా ఏసీబీ ఆఫీసర్లు వలపన్ని పట్టుకున్నారు. ఇదేవిధంగా రాష్ర్టంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వసూళ్లపర్వం సాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
స్టేషన్ బెయిల్ అంటే..
ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో నిందితులను కోర్టులో రిమాండ్ చేయాల్సిన అవసరం ఉండదు. వీరికి 41ఏ సీఆర్పీసీ కింద స్టేషన్ బెయిల్ ఇచ్చే అధికారం ఎంక్వైరీ ఆఫీసర్‌కు ఉంటుంది. వారి సమాధానం సంతృప్తికరంగా ఉంటే పూచీకత్తుపై స్టేషన్ బెయిల్ శాంక్షన్ చేయవచ్చు. తర్వాత కోర్టులో జరిగే ఎంక్వైరీకి నిందితులు హాజరు కావాల్సి ఉంటుంది. నిందితులు దురుద్దేశపూర్వకంగా నేరం చేసినట్టు భావించినా, బెయిల్‌పై బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నా, బాధితులను బెదిరించి కేను తప్పుదోవ పట్టిస్తారని అనుమానించినా స్టేషన్ బెయిల్ఇవ్వకుండా రిమాండ్‌కు తరలించవచ్చు. ఇది ఎంక్వైరీ ఆఫీసర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్రు
41ఏ సీఆర్పీసీ ప్రకారం స్టేషన్ బెయిల్ఇవ్వడం మంచిదే. తీవ్రమైన నేరాల్లో తప్ప చిన్న చిన్న కేసుల్లో నిందితులు కోర్టుల చుట్టూ తిరగడం తప్పుతుంది. నిందితులు నేరుగా కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కోర్టులపై కేసుల భారం తగ్గుతుంది. కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు స్వలాభం కోసం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పోలీస్‌శాఖపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. – బండవరపు జగన్, బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ, మంచిర్యాల
అందరికీ ఆపాదించడం తగదు
పోలీసులు చట్టప్రకారమే స్టేషన్ బెయిల్మంజూరు చేస్తున్నారు. ఒకరో ఇద్దరో అవినీతికి పాల్పడినంత మాత్రాన అందరికీ ఆపాదించడం తగదు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గత మూడేళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదు. పోలీస్ స్టేషన్లలో అవినీతికి తావు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.
– వి.సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్