బీఆర్ఎస్లో ‘కమ్మ పంచాది’.. సీఎం రమేశ్ వ్యాఖ్యలతో డ్యామేజ్.. ఖండించని కేటీఆర్

బీఆర్ఎస్లో ‘కమ్మ పంచాది’.. సీఎం రమేశ్ వ్యాఖ్యలతో డ్యామేజ్.. ఖండించని కేటీఆర్
  • ఇప్పటి వరకూ ఖండించని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
  • జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ప్రభావితం చేసే సామాజిక వర్గం 
  • కమ్మోళ్లు వద్దనుకొనే తుమ్మలను వదిలించుకున్నామని కేటీఆర్ చెప్పారన్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్
  • బీఆర్ఎస్ టికెట్ కమ్మ వాళ్లకే  వస్తుందన్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
  • ఓడిపోయిన తుమ్మలను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారన్న నల్లమోతు
  • సీసీ ఫుటేజీ బయటపెట్టాలన్న కాంగ్రెస్  నేత కుసుమ కుమార్, బీఆర్ఎస్ నేత నల్లమోతు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కమ్మ సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి  చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కమ్మ సామాజికవర్గం సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రమేశ్ ఇటీవల విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. కవిత సహా తమపై విచారణలు ఆపేస్తే బీఆర్ఎస్  ను బీజేపీలో విలీనం చేస్తామంటూ తమ వద్దకు వచ్చారని చెప్పారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ కూడా తమ వద్ద ఉందని అన్నారు. 

అదే తరుణంలో కమ్మోళ్లు చంద్రబాబు వైపు, రెడ్లు రేవంత్ రెడ్డి వైపు చూశారని చెప్పినట్టు తెలిపారు. కమ్మోళ్లు వద్దనుకొనే తుమ్మలను వదిలించుకున్నామని తనతో కేటీఆర్ చెప్పారంటూ సీఎం రమేశ్ తెలిపారు. జూబ్లీహిల్స్ లో ప్రభావితం చేసే ఓటర్లలో కమ్మవారుంటారు. ఈ తరుణంలో కమ్మోళ్ల ఓట్ల అంశం చర్చకు రావడం, కేటీఆర్ కమ్మోళ్లను వదిలించుకుంటున్నామని చెప్పారనటం హాట్ టాపిక్ గా మారింది.

బీఆర్ఎస్ మెర్జర్ విషయాన్ని ఖండించిన కేటీఆర్.. కమ్మోళ్లను తానలా అనలేదని ఎందుకు  చెప్పడం లేదని కమ్మ గ్రూప్ ఫెడరేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కుసుమ కుమార్ ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ కమ్మ సామాజిక వర్గంపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

సీసీ ఫుటేజీ ఉందని చెప్తున్న సీఎం రమేశ్.. దానిని ఎందుకు బహిర్గం చేయడం లేదంటున్నారు. తమ సామాజిక వర్గంపై అనవసర ఆరోపణలు చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో తమ సామాజిక వర్గం తక్కువ లేదని, త్వరలో జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో సత్తా చూపిస్తామంటూ సవాల్ విసురుతున్నారు. పరోక్షంగా నైనా బీ ఆర్ ఎస్ విలీనంను  ఖండించిన కేటీఆర్.. తమ సామాజిక వర్గంపై మాట్లాడిన మాటలపై ఎందుకు ఖండించలేదంటున్నారు. 

కమ్మ సామాజికవర్గానికే టికెట్
జూబ్లీహిల్స్ టికెట్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకే బీఆర్ఎస్ కేటాయిస్తుందని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు చెప్పారు. ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ హయాంలోనే కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం దక్కిందంటున్నారు. కేసీఆర్ మాదాపూర్ లో ఐదు ఎకరాలు కమ్మ సంఘం భవనం కోసం కేటాయించారని, తుమ్మల, పువ్వాడ కు మంత్రి పదవులు ఇచ్చారని చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతే ఎమ్మెల్సీని చేసి మంత్రిపదవిని ఇచ్చారని చెప్పారు.

నామా నాగేశ్వరరావును లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా పెట్టారని అంటున్నారు. తాతా  మధుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని, అదే విధంగా కొండ బాల కోటేశ్వర్ రావుకు ఏడేండ్ల పాటు కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు.  కేటీఆర్ కమ్మ సామాజికవర్గం గురించి మాట్లాడారని అనకాపల్లి సీఎం రమేష్ నిరాధర ఆరోపణలు చేశారని, సీసీ ఫుటేజీ ఉంటే వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.