
న్యూఢిల్లీ: ఇండియా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో ఇబ్బందికరమైన సంఘటన ఎదురైంది. ఢిల్లీలోని జేఎల్‌ఎన్ స్టేడియంలో శుక్రవారం వేర్వేరు ఘటనల్లో కెన్యా, జపాన్‌కు చెందిన కోచ్‌లను వీధి కుక్కలు కరిచాయి. స్టేడియం కాల్‌రూమ్ వెలుపల ఓ అథ్లెట్‌తో మాట్లాడుతుండగా కెన్యా కోచ్ డెన్నిస్ మారగియాను కుక్క కరిచింది. జపాన్ కోచ్ ఒకుమాట్సు వార్మప్ ట్రాక్ వద్ద శిక్షణను పర్యవేక్షిస్తుండగా కుక్క కాటుకు గురయ్యాడు.
కోచ్‌లను వెంటనే హాస్పిటల్‌కు తరలించి అవసరమైన ఇంజక్షన్లు, చికిత్స అందించిన తర్వాత హోటళ్లకు చేర్చారు. ప్రస్తుతంఇద్దరికీ ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యంగా ఉన్నారని ఆర్గనైజర్స్ తెలిపారు. ఈ ఘటనల పట్ల ఆర్గనైజింగ్ కమిటీ విచారం వ్యక్తం చేస్తూ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. టోర్నీకి ముందే స్టేడియం పరిసరాల్లో వీధి కుక్కలను తొలగించామని చెప్పింది. అయితే కొంతమంది వ్యక్తులు స్టేడియం సమీపంలో కుక్కలకు పదేపదే ఆహారం ఇవ్వడం వల్లే అవి మళ్లీ లోపలికి వచ్చాయని తెలిపింది.