
- సిరాజ్ పని భారం అనే భావనే తొలగించాడనుకుంటున్నా: సన్నీ
లండన్: టీమిండియా క్రికెట్ డిక్షనరీ నుంచి ‘పని భారం’ అనే మాట అదృశ్యం కావాలని కోరుకుంటున్నట్లు లెజెండ్ బ్యాటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. పని భారం అనే భావననే పేసర్ మహ్మద్ సిరాజ్ శాశ్వతంగా తొలగించాడని ప్రశంసలు కురిపించాడు. నొప్పులను, బాధలను మర్చిపోవడానికి దేశం కోసం ఆడుతున్నామనే భావన ఒకటి చాలన్నాడు. దేశాన్ని కాపాడుతున్న సైనికులను ఇందుకు ఉదాహరణగా చూపెట్టాడు. ఇంగ్లండ్‌తో డ్రా అయిన సిరీస్‌లో సిరాజ్ ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. మొత్తం 185.3 ఓవర్లు బౌలింగ్ చేసి 23 వికెట్లు తీశాడు. అదే టైమ్‌లో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్‌లే ఆడాడు. ఓవల్ టెస్ట్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉన్నా.. పని భారం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అయితే తాను బుమ్రా గాయంపై ఎలాంటి విమర్శలు చేయడం లేదన్న సన్నీ.. ఇంజ్యురీ మేనేజ్‌మెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పాడు.
‘మనం దేశం తరఫున ఆడుతున్నప్పుడు నొప్పులు, బాధలు మర్చిపోవాలి. సరిహద్దులో దేశాన్ని కాపలా కాసే జవాన్లు చలి గురించి మాట్లాడుతున్నారా? రిషబ్ పంత్ మనకు ఏం చూపెట్టాడు? కాలి వేలు ఫ్రాక్చర్ అయినా బ్యాటింగ్‌కు దిగాడు. ప్లేయర్ల నుంచి మనం ఆశించేది ఇదే. ఇండియా తరఫున క్రికెట్ ఆడటం గొప్ప గౌరవం. మీరు 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన ఆటతో సిరాజ్ హృదయాలను కొల్లగొట్టాడు. ఈ పని భారం అనే మాటను పూర్తిగా తొలగించాడని నేను భావిస్తున్నా. ఐదు టెస్ట్‌ల్లో అతను నాన్ స్టాప్‌గా 7–8 ఓవర్ల స్పెల్ వేశాడు. ఎందుకంటే కెప్టెన్ అతన్ని కోరుకున్నాడు.
దేశం కూడా అతని నుంచి ఆశించింది. దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు’ అని గావస్కర్ పేర్కొన్నాడు. అందుబాటులో ఉన్న అత్యుత్తమ 11 మందితో కూడిన జట్టును బరిలోకి దించేందుకు వర్క్‌లోడ్ అడ్డుకారాదని చెప్పాడు. ‘వర్క్‌లోడ్ గురించి మాట్లాడే వ్యక్తులకు మీరు లొంగిపోతే దేశం కోసం ఆడే అత్యుత్తమ ఆటగాళ్లు ఎవరూ ఉండరు. కాబట్టి ఇప్పటికైనా టీమిండియా క్రికెట్ డిక్షనరీ నుంచి పని భారం అనే పదం తొలగిపోతుందని ఆశిస్తున్నా. పని భారం అనేది కేవలం మానసిక విషయం, శారీరక విషయం కాదు. నేను చాలా కాలంగా ఇదే చెబుతున్నా’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు.