
న్యూఢిల్లీ: దేశంలోని మాజీ సైనికులందరికీ వన్ ర్యాంక్- వన్ పెన్షన్(ఓఆర్‌ఓపీ)బకాయిలను మార్చి 15లోగా చెల్లించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ రిటైర్డ్ పర్సనల్‌కు కూడా రిటైర్మెంట్ తేదీతో సంబంధం లేకుండా ఓఆర్‌ఓపీ చెల్లించాలని స్పష్టంచేసింది. మాజీ సైనికుల పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది.
కేంద్రం తరఫున ఏజీ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ రిటైర్డ్ పర్సనల్ పెన్షనర్ల లిస్ట్ తయారుచేసే పనిని కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్(సీజీడీఏ) పూర్తిచేసిందని కోర్టుకు తెలిపారు. మార్చి 15 నాటికి 25 లక్షల మంది పెన్షనర్ల ఖాతాల్లోకి డబ్బు చేరుతుందని.. కావున ఓఆర్‌ఓపీ బకాయిలను చెల్లించేందుకు గడువును పొడిగించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. పింఛన్ చెల్లింపునకు కేంద్రానికి రెండోసారి గడువు ఇచ్చింది.