- సూర్యాపేట జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ
- పాల్గొన్న ఎస్పీ నరసింహ
సూర్యాపేట, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని ఎస్పీ నరసింహ అన్నారు. ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టణ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు, డ్రైవర్లు, యువతతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ నరసింహ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా, ప్రమాదాల నివారణ కోసం విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి రోడ్డు భద్రత, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయాలని కోరారు. తెలంగాణాలో సంవత్సరానికి సగటున 7 వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, రామారావు, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ సునీత, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆదిత్య, ఎస్ఐలు సాయిరాం, ఏడుకొండలు, శివతేజ, మహేందర్ నాథ్, బాలు నాయక్, శ్రీకాంత్, మహేశ్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
