ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఒక గొప్ప మైలురాయిని దాటింది. భారతదేశంలో కంపెనీ ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు 10 మిలియన్లు అంటే 1 కోటి వాహనాలను తయారు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. హర్యానాలోని గురుగ్రామ్ ఫ్యాక్టరీ నుండి 1 కోటివ వాహనంగా సుజుకి యాక్సెస్ 125 (రైడ్ కనెక్ట్ ఎడిషన్) బయటకు వచ్చింది.
2006 నుండి మొదటి 50 లక్షల వాహనాలను తయారు చేయడానికి కంపెనీకి 14 ఏళ్లు పట్టింది. కానీ, మిగిలిన 50 లక్షల వాహనాలను కేవలం 6 ఏళ్లలోనే తయారు చేసింది. దీన్ని బట్టి సుజుకి వాహనాలకు ఇండియాలో ఎంత డిమాండ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
సుజుకి విజయాల్లో యాక్సెస్ 125 (Access 125) స్కూటర్ కీలక పాత్ర పోషించింది. ఈ స్క్యూటర్ ఫ్యామిలీస్ కి బాగా ఇష్టమైన స్కూటర్. దీనితో పాటు యువత కోసం బర్గ్‌మాన్ స్ట్రీట్, అవెనిస్ వంటి మోడల్స్ కూడా మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి.
బైక్ లలో కూడా టాప్:
స్కూటర్లే కాకుండా బైక్ ప్రియుల కోసం సుజుకి జిక్సర్ (Gixxer) సిరీస్‌లో 150cc, 250cc బైక్‌లను అందిస్తోంది. అలాగే పెద్ద బైక్‌ల విభాగంలో హయాబుసా, V-స్ట్రోమ్ వంటి పవర్ ఫుల్ బైక్‌లను కూడా అమ్ముతోంది.
సుజుకి ఇండియాలోని గురుగ్రామ్ ప్లాంట్ నుండి దాదాపు 60 దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తోంది. మన దేశంలో సుజుకికి 1,200కి పైగా షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, హర్యానాలోని ఖార్ఖోడాలో రెండవ ఫ్యాక్టరీని కూడా నిర్మిస్తున్నారు.
త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్:
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని సుజుకి ఇప్పటికే ఇథనాల్‌తో నడిచే జిక్సర్ SF 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ను పరిచయం చేసింది. అంతేకాకుండా, త్వరలోనే అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఇ-యాక్సెస్ (e-Access) పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది.
