యాదగిరి గుట్టలో సామూహిక గిరి ప్రదక్షిణ

యాదగిరి గుట్టలో  సామూహిక గిరి ప్రదక్షిణ

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా.. సోమవారం దేవస్థానం ఆధ్వర్యంలో 'సామూహిక గిరిప్రదక్షిణ' కార్యక్రమాన్ని చేపట్టారు. తెల్లవారుజామున ఉదయం 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద భక్తులతో కలిసి ఆలయ ఈవో భాస్కర్ రావు నారసింహుడి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసి గిరిప్రదక్షిణ ఆరంభించారు. గిరిప్రదక్షిణలో భాగంగా భక్తులు రెండున్నర కిలోమీటర్లు కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేశారు. అనంతరం నారసింహుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. 

గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు దేవస్థాన ఆఫీసర్లు ప్రత్యేక దర్శనం సదుపాయం కల్పించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. గిరిప్రదక్షిణలో భాగంగా కొందరు భక్తులు భజన, నృత్య బృందాలు చేసిన భజనలు, భక్తిగీతాలు, కీర్తనలు, సంకీర్తనలు, నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అష్టోత్తర శతఘటాభిషేక కైంకర్యాన్ని ఆలయ అర్చకులు అట్టహాసంగా నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు శతఘటాభిషేకాన్ని ఘనంగా చేపట్టారు. 108 కలశాల్లో ఉన్న మంత్రజలంతో స్వామివారికి అర్చనాభిషేకాలు నిర్వహించారు.