
- పెళ్లి చేసుకుందామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.45 లక్షలు వసూలు
- నిందితుడిని అరెస్ట్ చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు
హైదరాబాద్,వెలుగు:ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి అమ్మాయిలా మాట్లాడుతూ.. ప్రేమ, పెళ్లి పేరుతో పలువురిని ట్రాప్ చేసి డబ్బులు కొట్టేస్తున్న నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన మోతె అశోక్(28) జల్సాలకు బానిసై బీటెక్ ఫైనలియర్‌లో చదువు మానేశాడు. ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేసేవాడు. ఫేస్‌బుక్‌లో అబ్బాయిలను ట్రాప్ చేసి మోసం చేసేందుకు స్కెచ్ వేశాడు. 2020 ఫిబ్రవరిలో ‘ఇందూష తుమ్మల’ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అందమైన అమ్మాయిల ఫొటోలను ఫేస్ బుక్ ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకుని కనిపించిన ప్రతి అకౌంట్‌కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేవాడు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వారితో అమ్మాయిలా చాటింగ్ చేస్తూ వాయిల్ కాల్ మాట్లాడేవాడు. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాయిస్ చేంజ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఇలా అబ్బాయిలతో పరిచయం పెంచుకుని ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసేవాడు. ఇటీవల జూబ్లీహిల్స్‌కు చెందిన ప్రవీణ్‌కు ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి అశోక్ రిక్వెస్ట్ పంపించాడు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన ప్రవీణ్‌తో అమ్మాయిలా చాట్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
అతడిని నమ్మించేందుకు వాయిస్ ఛేంజ్‌యాప్ సాయంతో అమ్మాయిలా మాట్లాడాడు. వివిధ కారణాలు చెప్పి రెండేండ్ల కాలంలో ప్రవీణ్ నుంచి రూ.45 లక్షలు వసూలు చేశాడు. బాధితుడి కంప్లయింట్‌తో కేసు ఫైల్ చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రెస్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నూజివీడులో అశోక్‌ను అదుపులోకి తీసుకుని బుధవారం సిటీకి తీసుకొచ్చారు. అతడి నుంచి రూ.2 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. కొట్టేసిన డబ్బుతో అశోక్ ఆన్ లైన్లో గేమ్స్ ఆడేవాడని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. అశోక్ బారినపడి మోసపోయిన బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. నిందితుడిని రిమాండ్‌కి తరలించామన్నారు.