చెన్నైకి చెందిన ఒక స్టార్టప్ యజమాని పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఓ 22 ఏళ్ల యువకుడు ఆఫీసు ఉద్యోగాన్ని వదిలేసి, డెలివరీ బాయ్‌గా మారడమే ఇందుకు కారణం. సీకో వెల్త్ అనే కంపెనీ ఓనర్ అక్షత్ జైన్ ఆఫీసులో అడ్మిన్ విభాగంలో పనిచేసే ఓ యువకుడి గురించి పోస్ట్ చేశారు. ఆ యువకుడు నెలకు రూ. 40,000 సంపాదించవచ్చనే ఆశతో కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి, డెలివరీ బాయ్‌గా మారాడు.
అతను చాలా తెలివైనవాడని, రాబోయే 3-5 ఏళ్లలో అతను కంపెనీలో ఒక లీడర్‌గా ఎదుగుతాడని అనుకున్నట్లు జైన్ చెప్పారు. అతనికి ఏఐ (AI) టూల్స్ నేర్పించామని, మంచి పుస్తకాలు ఇచ్చి కెరీర్ పరంగా గైడెన్స్ కూడా ఇచ్చామని... డెలివరీ బాయ్ గా పని చేస్తే వెంటనే డబ్బు రావచ్చు కానీ, అందులో ఎదుగుదల ఉండదని, ఆరోగ్యం కూడా పాడవుతుందని జైన్ చెప్పుకొచ్చారు.
అయితే ఈ పోస్ట్‌పై నెటిజన్లు చాలా ఘాటుగా స్పందించారు. కంపెనీ యజమానిని ప్రశ్నిస్తూ రకరకాల కామెంట్లు చేశారు. అతను రూ.35-40 వేల కోసం డెలివరీ బాయ్ జాబ్ కోసం వెళ్లాడంటే, మీరు అతనికి చాలా తక్కువ జీతం ఇస్తున్నారని అర్థం. ఏఐ నేర్పించడం కంటే కడుపు నిండా తిండి పెట్టడం ముఖ్యం అని ఒకరు మండిపడ్డారు.
మరొకరైతే అతను ప్రతిభావంతుడని తెలిసి కూడా కేవలం 15-20 వేలు ఇచ్చి పని చేయించుకోవడం... దోపిడీ కిందకే వస్తుంది అని విమర్శించారు. ఐదేళ్ల తర్వాత పెరిగే జీతం కోసం ఇప్పుడు ఆకలితో ఉండాలా ? పైగా రేపు ఏఐ వస్తే అతన్ని ఉద్యోగం నుంచి తీసేయరని గ్యారెంటీ ఏంటి ? అని ఇంకొందరు ప్రశ్నించారు. అడ్మిన్ పని కంటే డెలివరీ బాయ్ పనే గౌరవంగా ఉందని మరికొందరు కామెంట్ చేశారు.
డబ్బులు తక్కువైనా భవిష్యత్తు కోసం ఆఫీసులోనే ఉండాలా ? లేక ప్రస్తుత అవసరాల కోసం ఎక్కువ డబ్బులు వచ్చే పనికి వెళ్లాలా ? అనే అంశంపై ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తంగా ఆ యువ ఉద్యోగి తీసుకున్న నిర్ణయం సరైనదేనని నెటిజన్లు సమర్థిస్తున్నారు.

