
- రైట్ లోలెవెల్ కెనాల్ నుంచి అక్రమంగా మళ్లింపు
- గురురాఘవేంద్ర లిఫ్ట్ నుంచి విచ్చలవిడిగా వాడకం
హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర నంచే ఏపీ నీటి దోపిడీకి పాల్పడుతున్నదని తెలంగాణ ఆరోపించింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ తుంగభద్ర నుంచి అధిక నీటిని తరలిస్తున్నదని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వెల్లడించింది. తుంగభద్ర రైట్ లోలెవెల్ కెనాల్ నుంచి 29.50 టీఎంసీల వినియోగానికి మాత్రమే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందని, అందులో 5.5 టీఎంసీలు ఆవిరి నష్టాలుపోనూ 24 టీఎంసీలను తరలించుకుంటున్నదని తెలంగాణ పేర్కొంది.
పశ్చిమ కనుమల నుంచి వచ్చే వరద ప్రవాహాలు శ్రీశైలం వరకు చేరేలా ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందని, డ్యామ్ నిండే వరకు తుంగభద్ర నుంచి నీటిని వాడుకోకుండా కర్నాటక, ఏపీకి ఆంక్షలు విధించిందని గుర్తుచేసింది. గురువారం రెండో రోజు ట్రిబ్యునల్ ముందు తెలంగాణ అడ్వొకేట్లు, అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తరపున తుది వాదనలు వినిపించారు. బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ తుంగభద్ర కుడి లోలెవెల్ కెనాల్ ద్వారా గురు రాఘవేంద్ర లిఫ్ట్ స్కీం నుంచి అధికంగా నీటిని వాడుకుంటున్నదని ట్రిబ్యునల్ కు వివరించారు. ఒకే ఆయకట్టుకు ఇటు తుంగభద్ర కుడి లోలెవెల్ కెనాల్, అటు గురు రాఘవేంద్ర లిఫ్ట్, ఆర్డీఎస్ నుంచి నీళ్లు తరలించే ఏర్పాట్లు చేసిందని, దాంతో శ్రీశైలం రిజర్వాయర్ కు నీళ్లు రాకుండా పోతాయని అభ్యంతరం తెలిపారు.
తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు అందని పరిస్థితులు ఏర్పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తుంగభద్ర నది నుంచి గురు రాఘవేంద్ర లిఫ్ట్ కు నీళ్లు తీసుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వవద్దని కోరారు. అక్కడ శాస్త్రీయ లెక్కల ప్రకారం ఆయకట్టుకు 17.41 టీఎంసీలు సరిపోతాయని, ఇప్పుడు తరలిస్తున్న నీటి నుంచి 6.59 టీఎంసీలను ఆదా చేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ఆదా చేసిన 6.59 టీఎంసీల నీటిని తెలంగాణలోని ఇన్ బేసిన్ ప్రాజెక్టులకు కేటాయించాలని కోరారు. కాగా.. తెలంగాణ వాదనలు శుక్రవారం కూడా కొనసాగనున్నాయి.