మే 15న పీసీసీ కార్యవర్గం ప్రకటన .. హైకమాండ్ తో పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్​ గౌడ్ భేటీ

మే 15న పీసీసీ కార్యవర్గం ప్రకటన .. హైకమాండ్ తో పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్​ గౌడ్ భేటీ
  • ఢిల్లీలో అగ్ర నేతలతో చర్చలు.. తుది జాబితాకు ఆమోదం తెలిపిన అధిష్టానం
  • నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 35-40  మంది వైస్ ప్రెసిడెంట్లు, 70–75 మంది జనరల్  సెక్రటరీల నియామకం
  • వీటితోపాటు పీఏసీ, క్యాంపెయిన్ కమిటీల ప్రకటన
  • పొలిటికల్ అడ్వైజరీ కమిటీ లో చురుగ్గా ఉన్న సీనియర్ నేతలకు చాన్స్​

హైదరాబాద్, వెలుగు: పీసీసీ కార్యవర్గం కసరత్తు తుది దశకు చేరింది. గురువారం రాత్రికల్లా కార్యవర్గ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్..పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ తో కలిసి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. పీసీసీ కార్యవర్గం ప్రకటనకు సంబంధించిన అంశంపైనే ప్రధానంగా చర్చించారు. గతవారమే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ఫైవ్ మెన్ కమిటీ విడివిడిగా సమావేశమైంది. పీసీసీ కార్యవర్గంలో ఎవరికి చోటు కల్పించాలనే దానిపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

గతవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్.. ఖర్గేతో సమావేశమై పీసీసీ కార్యవర్గంపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అప్పుడు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. ఆ టూర్ రద్దయింది. ఫోన్ లోనే ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దాని ఆధారంగానే పీసీసీ కార్యవర్గం తుది జాబితా రెడీ అయింది. దీనిపై బుధవారం మరోసారి కేసీ వేణుగోపాల్ తో మహేశ్ గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ అయి చర్చలు జరిపారు.

సామాజిక వర్గాలకు సమప్రాధాన్యం

కార్యవర్గం ఏర్పాటులో సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేసినట్టు తెలుస్తున్నది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 35-–40  మంది వైస్ ప్రెసిడెంట్లు, 70–75 మంది ప్రధాన కార్యదర్శులతో జాబితా వెలువడనుందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. వీటితోపాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ ), క్యాంపెయిన్ కమిటీలను కూడా నియమించనున్నట్టు సమాచారం. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లలో ఒక రెడ్డి, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ,  ఒక మైనార్టీకి అవకాశం దక్కనుంది. ఇందులో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కమార్, ఎంపీ బలరాం నాయక్, ఫహీం ఖురేషీ లేదా ఫిరోజ్ ఖాన్  పేర్లు ప్రచారంలో ఉన్నాయి.  పీఏసీ కమిటీలో జానారెడ్డి, జీవన్ రెడ్డి, రేణుకా చౌదరి ఉండే అవకాశం ఉంది. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డి పేరు ప్రచారంలో ఉంది.