
హైదరాబాద్, వెలుగు: నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, ఆర్టిజన్లు వర్క్ బాయ్‌కాట్ చేసి నిరసన చేశారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఆందోళనల్లో జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్ రావు, కో-చైర్మన్ శ్రీధర్, కో-కన్వీనర్ బీసీ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో విద్యుత్ సౌధ, మింట్ కాంపౌండ్, సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, మేడ్చల్, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, హబ్సిగూడ, కూకట్‌పల్లిలో ధర్నాలు నిర్వహించారు. అలాగే, పలు జిల్లాల్లోని విద్యుత్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను విరమించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.