
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు, వెలుగు : ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫథకాలను పేదలందరికీ అందించడమే తమ లక్ష్యమని, అందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా ములుగు కలెక్టరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 8,968మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేశామన్నారు.
దీపం పథకం ద్వారా 200ల యూనిట్ల లోపు 41,761మంది ఉచిత విద్యుత్ సేవలను పొందుతున్నారని వెల్లడించారు. నియోజకవర్గంలో 6 వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, మెడికల్, నర్సింగ్ కాలేజీలు, ఆయిల్ ఫ్యాక్టరీ, ఎకో పార్కు, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సేవలు అందించిందని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఎస్పీ పి.శబరీశ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అడిషనల్ కలెక్టర్లు సీహెచ్.మహేందర్ జీ, జి.సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఆర్డీవో వెంకటేశ్తదితరులు పాల్గొన్నారు.