- నియామకానికి సర్కారు నిర్ణయం
- రాష్ట్రంలో 87 వేల ఎకరాలకుపైగా ఉన్న దేవాదాయ భూములు
- 20 వేల ఎకరాలకుపైగా కబ్జా
- వితౌట్ లిటిగేషన్‌తో మరో
- 5వేల ఎకరాలకుపైగా ఆక్రమణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆలయ భూములను ఆక్రమణదారుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న వేల ఎకరాల భూముల రక్షణకు, కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చూసేందుకు ప్రతి జిల్లాకు ఒక లీగల్ అడ్వైజర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఎండోమెంట్డిపార్ట్మెంట్ చరిత్రలో ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అయితే, రాష్ట్రంలో ధూప, దీప నైవేద్యాల కోసం పూర్వం కేటాయించిన భూములు కబ్జాల పాలవుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయశాఖకు చెందిన భూములు మొత్తం 87,235.39 ఎకరాలు ఉండగా, అందులో 20,124.03 ఎకరాలు ఆక్రమణదారుల చెరలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరో 5,569.35 ఎకరాలు ఎలాంటి లిటిగేషన్ లేకుండానే కబ్జాకు గురైనట్లు గుర్తించారు. కోర్టు వివాదాలు, కబ్జాల కారణంగా ఆలయాలకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆలయ ఈఓలకు దిశానిర్దేశం..
ఇప్పటివరకు న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా అధికారులు రాష్ట్రస్థాయి కార్యాలయం లేదా ఏజీ ఆఫీస్‌పై ఆధారపడాల్సి వచ్చేది. ఇకపై జిల్లా స్థాయిలోనే లీగల్ అడ్వైజర్లు అందుబాటులో ఉండి పెండింగ్ కేసులపై కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడం, బలమైన వాదనలు వినిపించడం, ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయడం, ఎన్‌క్రోచ్‌మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంలో అధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా కొత్తగా భూములు ఆక్రమణకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలు, లీజు గడువు ముగిసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే విధానాలపై ఆలయ ఈఓలకు జిల్లా అడ్వైజర్ అవగాహన కల్పించనున్నారు. జిల్లాకో లీగల్ అడ్వైజర్ నియామకంతో స్థానిక కోర్టులు, ట్రిబ్యునళ్లలో కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో
భూముల ఆక్రమణ..
రాష్ట్రవ్యాప్తంగా 20,124.03 ఎకరాల ఆలయ భూములు ఆక్రమణలకు గురికాగా.. వితౌట్ లిటిగేషన్ తో మరో 5,569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఎండోమెంట్ అధికారులు గుర్తించారు. అత్యధికంగా మహబూబ్నగర్జిల్లాలో 5,522.22 ఎకరాల ఆలయ భూములు ఉండగా, 3,018.01 ఎకరాలు కబ్జాకు గురైనట్లు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాలో 4,125.03 ఎకరాల్లో 2,888.18 ఎకరాలు, హైదరాబాద్ జిల్లాలో 5,718.01 ఎకరాల్లో 2,374.25 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. సికింద్రాబాద్ లో 279.25 ఎకరాలుండగా.. 7.12 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 9,360.01 ఎకరాలుండగా.. 1,148.15 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 2,294.26 ఎకరాలుండగా.. 444.16 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 5,429.03 ఎకరాలుండగా.. 688.34 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 6,963.32 ఎకరాలుండగా.. 1,374.35 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 2,377.09 ఎకరాలుండగా.. 645.38 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని అధికారులు నిర్ధారించారు. ఆయా జిల్లాల్లో భూముల ధరలు అధికంగా పెరగడమే కబ్జాలకు కారణమని, భూముల రక్షణకు చర్యలు చేపట్టకపోతే దేవాలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
