మినీ అంగన్ వాడీ టీచర్లకు ప్రమోషన్లు

మినీ అంగన్ వాడీ టీచర్లకు ప్రమోషన్లు
  • 3,989 మందికి మెయిన్ టీచర్లుగా పదోన్నతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న  3,989 మంది మినీ అంగన్ వాడీ టీచర్లకు మెయిన్ అంగన్ వాడీ టీచర్లుగా ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రాంచంద్రన్ మంగళవారం మోమో జారీ చేశారు. ఉత్తర్వులు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని సెక్రటరీ స్పష్టం చేశారు.ఈ నిర్ణయం వల్ల  ఇకపై అంగన్ వాడీ టీచర్ల మాదిరిగానే  మినీ అంగన్వాడీ టీచర్లు వేతనాలు, ఇతరత్రా ప్రయోజనాలు అందుకోనున్నారు.  

గత నెల వరకు మినీ అంగన్ వాడీ టీచర్లకు రూ. 7800 వేతనం వస్తుండగా అంగన్ వాడీ టీచర్లకు రూ. 13,650 వేతనం అందుతోంది. ఇకపై మినీ అంగన్​వాడీ టీచర్లు సైతం రూ.13,650 చొప్పున వేతనం అందుకోనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు మినీ అంగన్వాడీ టీచర్లు కృతజ్ఞతలు తెలిపారు. మినీ అంగన్ వాడీ టీచర్లకు అంగన్ వాడీ టీచర్లుగా పదోన్నతులు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది. తాజాగా దాన్ని అమలు చేయనుండటంతో  మరో హామీని కాంగ్రెస్​ప్రభుత్వం అమలుచేసినట్లయింది.