‘మనఊరు–మనబడి’ స్కీమ్ పై అయోమయం

 ‘మనఊరు–మనబడి’ స్కీమ్ పై అయోమయం
  • మన ఊరు మన బడి’పై గైడ్​లైన్సే రాలే
  • 2 నెలల్లో మూడున్నర వేల కోట్లు ఖర్చు ఎట్ల?
  • అవసరమైన ఫండ్స్ సేకరణపైనా క్లారిటీ లేదు
  •  స్కీమ్ అమలుపై అంతా గందరగోళం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ గొప్పగా ప్రకటించిన ‘మనఊరు–మనబడి’ స్కీమ్ అమలుపై అయోమయం నెలకొంది. ఈ అకడమిక్ ఇయర్ లోనే ప్రారంభిస్తామని, రెండేండ్లు కొనసాగిస్తామని సర్కారు ప్రకటించింది. ఇటీవల కేబినెట్​లో ఈ స్కీమ్​కు ఆమోదం తెలిపి మూడేండ్ల పాటు మూడు విడుతల్లో దీన్ని అమలు చేస్తామని వెల్లడించింది. అయితే ఫైనాన్షియల్​ ఇయర్ ముగిసేందుకు మరో రెండు నెలలు టైమ్ మాత్రమే ఉండగా.. ఫస్ట్ ఫేజ్ లో ఖర్చు చేస్తామని ప్రకటించిన మూడున్నర వేల కోట్లు ఎట్ల వెచ్చిస్తారోననే అయోమయం నెలకొన్నది. అలాగే కేబినెట్ మీటింగ్ జరిగి వారం దాటినా ఇప్పటికీ ఈ స్కీమ్​కు సంబంధించిన విధివిధానాలు, గైడ్​లైన్స్ ను సర్కారు రిలీజ్ చేయలేదు.

రిపోర్ట్ ఇచ్చే సరికి టైమ్ అయిపోయింది
స్టేట్​లో మొత్తం 26వేల సర్కారీ స్కూళ్లుండగా, వాటిలో 20 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వీటిలో సౌలత్​ల కోసం 2021 మార్చి బడ్జెట్​లో రూ.2వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది మరో రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ ఆదేశాల మేరకు ఏపీలో కొనసాగుతున్న స్కూళ్ల డెవలప్​మెంట్​పై జరుగుతున్న ‘నాడు నేడు’ కార్యక్రమాన్ని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు రెండు సార్లు వెళ్లి పరిశీలించి వచ్చారు. కేబినెట్ సబ్ కమిటీ కూడా దీనిపై సర్కారు నివేదిక ఇచ్చే సరికి, ఫైనాన్షియల్ ఇయర్ ముగింపునకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్​లో బడుల బాగు కోసం చేపట్టే పనులకు మన ఊరు– మన బడి అనే పేరు కూడా ప్రకటించారు. దీనికి రూ.7289.54 కోట్లు బడ్జెట్ అవసరమని పేర్కొన్నారు. ఫస్ట్ ఫేజ్​లో వీటిలో 9,123 బడుల (35%) అభివృద్ధికి రూ.3,497.62 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. 

ఆ రూ.2వేల కోట్లైనా రిలీజ్ అయ్యేనా
ఈనెల 17న జరిగిన కేబినెట్​మీటింగ్​లో స్కీం ఆమోదం పొందడంతో వెంటనే జీవో వస్తుందనీ అంతా అనుకున్నారు. కానీ పదిరోజులైతున్నా గైడ్​లైన్స్ రిలీజ్ కాలేదు. అయితే రంగారెడ్డి, హైదరాబాద్ జిలాల్లోని నాలుగు స్కూళ్లను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి పనులు చేస్తున్నారు. ప్రతి బడిలో మంచినీళ్లు, కరెంట్, టాయ్ లెట్లు, ఫర్నిచర్, పెయిటింగ్, రిపేర్లు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ, అడిషనల్ క్లాస్ రూమ్స్, కిచెన్ షెడ్లు, కూలిపోయేలా ఉన్న క్లాసుల రూమ్ ల నిర్మాణం, డిజిటల్ ఎడ్యుకేషన్ కు అవసరమైన పరికరాలు తదితర 12 అంశాలకు ప్రయార్టీ ఇస్తామని సర్కారు ప్రకటించింది. ఇవన్నీ ఎప్పటిలోపు చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. సర్కారు ఇప్పుడు జీవో ఇచ్చినా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వం ప్రకటించిన రూ.3,497కోట్లను ఖర్చు చేయడం సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం బడ్జెట్​లో ప్రకటించినట్టు రూ.2 వేల కోట్లైనా రిలీజ్ చేస్తారో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ఫండ్స్ తెచ్చుడు ఎట్ల
స్కీమ్​కు ఫండ్స్ ఎట్ల అనేదానిపై సర్కారు క్లారిటీ ఇవ్వడం లేదు. బడ్జెట్​లో రూ.2వేల కోట్లు ఇస్తామని చెప్పినా, ఇప్పటికీ ఆ నిధులను విడుదల చేయలేదు. మరోపక్క సర్కారు వద్ద నిధుల కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫండ్స్ తేవడంపై అందరి దృష్టి పడింది. సర్కారు పెద్దలు మాత్రం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల్లో నుంచి కొంత, ఎస్సీ, ఎస్టీ డిపార్ట్​మెంట్లు, ఎస్​ఎస్​ఏ నిధుల నుంచి ఇంకొంత తీసుకుంటారని చెబుతున్నారు. అలాగే నాబార్డ్ నుంచి రూ.500 కోట్లు కూడా అప్పు రూపంలో తీసుకుంటున్నట్టు సమాచారం. సర్కారు నేరుగా బడ్జెట్​లో పెట్టినట్టు నిధులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందనీ ఇప్పటికే సర్కారు ప్రకటించింది.

అడిషనల్ క్లాస్ రూమ్స్     12 వేలు 
కొత్త టాయ్​లెట్లు    8 వేల యూనిట్లు 
స్కూల్స్ రిపేర్లు(మైనర్)    18 వేల స్కూళ్లు 
మేజర్ రిపేర్లు     10 వేల స్కూళ్లు 
ప్రహరీలు    8 వేల స్కూల్స్ 
కిచెన్ షెడ్లు     2 వేల స్కూల్స్ 
ఫర్నిచర్, పెయింటింగ్     దాదాపు అన్ని బడులు