కాళేశ్వరం కమిషన్​ గడువు మరో రెండు నెలలు పొడిగింపు

కాళేశ్వరం కమిషన్​ గడువు మరో  రెండు నెలలు పొడిగింపు
  • రెండు నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • వారంలో రిపోర్ట్​ వచ్చే చాన్స్​ ఉండగా.. ఇంతలోనే గడువు పెంపు
  • ఇప్పటికే  109 మంది ఆఫీసర్లు, వ్యక్తుల స్టేట్​మెంట్ల రికార్డ్​
  • ఇంకా ఎవరిని విచారిస్తారన్న దానిపై ఊహాగానాలు

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ నెల 31తో కమిషన్​ గడువు ముగుస్తుండగా.. జులై 31 వరకు పొడిగిస్తూ సోమవారం ఇరిగేషన్​ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘హైదరాబాద్​లో కమిషన్​ తదుపరి సిట్టింగ్స్​నిర్వహించి విచారణను పూర్తి చేసి జులై 31 నాటికి రిపోర్టును సమర్పిస్తుంది’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి ఈ వారంలోనే  ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్టు అందజేసేందుకు సిద్ధమైంది. అధికారులను, ఇంజనీర్లను విచారించి రిపోర్టుకు తుది మెరుగులు దిద్దుతున్నది. ఇలాంటి టైమ్​లో అకస్మాత్తుగా ప్రభుత్వం కమిషన్​ గడువును మరో రెండు నెలలు పొడిగించడం, మళ్లీ విచారణ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం వెనుక మర్మమేమిటని రాజకీయ వర్గాలు, అధికారుల్లో చర్చ జరుగుతున్నది. కమిషన్ మళ్లీ​ సిట్టింగ్స్ నిర్వహిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో ఇంకా పలువురి విచారించనుందనే విషయం స్పష్టమవుతున్నది. అయితే.. ఎవరిని విచారిస్తారనేది హాట్​ టాపిక్​గా మారింది. 

ఏడోసారి..!

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్​ 21న కుంగిపోయింది. బ్యారేజీలోని ఏడో బ్లాక్​ మీటరున్నర మేర భూమి లోపలికి కూరుకుపోయింది.  దీనిపై అటు నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ ఏ), ఇటు విజిలెన్స్​ డిపార్ట్​మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలు 
సమర్పించాయి. 

ఇంకెవరున్నరు?

ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్​ గడువును మరో రెండు నెలలు పొడిగించడం వెనుక ఆంతర్యమేమిటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంకెవరిని విచారణకు పిలుస్తారన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. అప్పట్లో అధికారులను విచారించిన తర్వాత.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించి నాటి సీఎం కేసీఆర్​, నాటి ఇరిగేషన్​ మంత్రి హరీశ్​ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్​ను విచారణకు పిలుస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ, కమిషన్​ మాత్రం వారిని పిలువలేదు. వారి వాంగ్మూలాలు లేకుండానే రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అయింది. రిపోర్టు సమర్పించడానికి ముందు కమిషన్​.. లీగల్​ ఒపీనియన్​ తీసుకున్నట్లు తెలిసింది. కమిషన్​ క్రాస్​ ఎగ్జామినేషన్​లో దాదాపు అధికారులందరూ అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగానే నడుచుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో కేవలం అధికారుల స్టేట్​మెంట్ల ఆధారంగానే రిపోర్ట్​ను సమర్పిస్తే లీగల్​ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నోళ్ల స్టేట్​మెంట్లు రికార్డు చేయాలని కమిషన్​ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్​, హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ను కూడా విచారించేందుకే కమిషన్​ గడువును రెండు నెలలు పొడిగించి ఉంటారని అధికారులు చర్చించుకుంటున్నారు. వాటికి సమాంతరంగా కాంగ్రెస్​ ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్​ జడ్జి జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ చైర్మన్​గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ను ఏర్పాటు చేసింది. 

తొలుత రిపోర్టు సమర్పించేందుకు ప్రభుత్వం అదే ఏడాది జూన్​ 30 వరకు కమిషన్​కు గడువు ఇచ్చింది. అప్పటికి ఇంకా ఎంక్వైరీ కూడా మొదలుకాకపోవడం.. ప్రాథమిక దశలోనే ఉండడంతో గడువును ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ జూన్​ 29న తొలిసారి గడువును పొడిగించింది. మళ్లీ విచారణ పూర్తికాకపోవడం.. అధికారుల అఫిడవిట్లు సమర్పణ దగ్గరే ఉండడంతో ఆ గడువు సరిపోలేదు. దీంతో రెండోసారి అక్టోబర్​ 31 వరకు గడువును పొడిగిస్తూ ఆగస్టు 28న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అసలు విచారణ అప్పుడే మొదలు కావడం.. ఓపెన్​ కోర్టులు నిర్వహించాల్సి ఉండడంతో డిసెంబర్​ 31 వరకు గడువును మూడోసారి పొడిగిస్తూ నవంబర్​ 12న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత నాలుగోసారి 2025 ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగిస్తూ 2024 డిసెంబర్​ 21న, ఐదోసారి 2025 ఏప్రిల్​ 30 వరకు పొడిగిస్తూ 2025 ఫిబ్రవరి 20న, ఆరోసారి గడువును 2025 మే 31 వరకు పొడిగిస్తూ 2025 ఏప్రిల్​ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  తాజాగా ఏడోసారి గడువును పొడిగిస్తూ  జులై 31 వరకు కమిషన్​ రిపోర్టుకు టైమ్​ ఇచ్చింది.

తుది దశకు రిపోర్ట్​!

వాస్తవానికి ఐదోసారి గడువును పొడిగించే సమయం నాటికే.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఇంజనీరింగ్​, ఆర్థిక శాఖ అధికారులతో పాటు ఐఏఎస్​లను కమిషన్​ విచారించింది. 109 మంది అధికారులు, పలువురు స్వతంత్ర వ్యక్తుల స్టేట్​మెంట్లను రికార్డ్​ చేసింది. అయితే, వారు చెప్పిన వివరాల ఆధారంగా రిపోర్ట్​ను సిద్ధం చేసే పని ఆలస్యం కావడంతో సర్కారు ఆరోసారి గడువును పొడిగించింది. ఇప్పుడు ఆ రిపోర్టు తుది దశకు వచ్చింది. ఈ నెల 21న  సీఎస్​కు కమిషన్​ రిపోర్టును సమర్పించనున్నందన్న వార్తలు వచ్చాయి.