కామారెడ్డి, వెలుగు : అవినీతి రహిత పాలనే ధ్యేయంగా రెండేండ్ల కాలంలో కామారెడ్డి మున్సిపాలిటీలో అక్రమాలను అరికట్టి అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆఫీస్‌లో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. కామారెడ్డి మున్సిపాలిటీకి ఏడాదికి రూ.6 కోట్లు ఆదాయం వస్తే ఖర్చు రూ.18 కోట్లు ఉందన్నారు. తాను అధికారులతో ఇండ్లను తిరిగి అసెస్మెంట్ చేయించడంతో ఇప్పుడు మున్సిపల్‌కు రూ. 11కోట్ల ఆస్తి పన్ను వస్తుందన్నారు.
కరెంట్బిల్లులు, పీఎఫ్ , ఈఎస్ఐ బకాయిలు చెల్లించామని, ఫేక్ బిల్లులను అడ్డుకున్నామని తెలిపారు. గతంలో స్థలాలు కబ్జా అయ్యాయని, రూల్స్‌కు విరుద్దంగా లే అవుట్లకు మంజూరు ఇచ్చేవారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పనులకు నిధులు తెచ్చినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ చెప్పుకోవడంలో వాస్తవం లేదని విమర్శించారు.
టౌన్లో తాగునీటి కోసం అమృత్ 2 స్కీమ్ కింద 2022లోనే నిధులు మంజూరయ్యాయన్నారు. టౌన్లో 83 కి.మీ. పైపులైన్ కోసం, ట్యాంక్‌ల నిర్మాణానికి నిధులు వచ్చాయన్నారు. డ్రైనేజీల నిర్మాణానికి యూఐడీఎఫ్ కింద టౌన్‌కు రూ.18 కోట్లు మంజూరు చేయించానన్నారు. జిల్లా కేంద్రంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు, వికాస్ నగర్, కలెక్టరేట్ ఆఫీస్ సమీపంలో, పాత రాజంపేట వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మించాలని కేంద్రానికి విన్నవించానని పేర్కొన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపానని, డీపీఆర్ కూడా సిద్ధమైందన్నారు.
లింగాపూర్ నుంచి డెయిరీ కాలేజీ వరకు రోడ్డు కోసం రూ. 40 కోట్లు శాంక్షన్ కానున్నాయన్నారు. షబ్బీర్‌అలీ నిజామాబాద్‌ను వదిలీ కామారెడ్డి అభివృద్ధిని పట్టించుకోవాలన్నారు. రోడ్డు వెడల్పు కోసం తాను ఇల్లు కూల్చివేసుకున్నానని, షబ్బీర్‌అలీ ఇల్లు మాత్రం ఇంకా రోడ్డులోనే ఉందని ఆరోపించారు. బేజేపీ కౌన్సిలర్లను గెలిపించి చైర్మన్ పదవి కట్టబెడితే కామారెడ్డి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ నీలం చిన్న రాజులు, జనరల్ సెక్రటరీ బండారి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
