
ముషీరాబాద్,వెలుగు: తెలంగాణలో యానాదులను గుర్తించిన ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను మాత్రం ఇవ్వడం లేదని స్టేట్ యానాది వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ ఈ. ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆదివారం చిక్కడపల్లిలోని ఓ హోటల్లో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ తోపాటు యానాదుల జాతి ఆణిముత్యాలు రిటైర్డ్ డీఐజీ సీహెచ్ వెంకటేశ్వర్లు, ఎకనామిక్స్ లో పీజీ చేసిన శివమ్మ ను ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో యానాదులు ఎప్పటినుండో నివసిస్తున్నా సంక్షేమ పథకాలు, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వడంలేదని పేర్కొన్నారు.
రిటైర్డ్ డీఐజీ సీహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మనతోపాటు జాతిలో వెనకబడిన వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనఅందరిపై ఉందని సూచించారు. ఆల్ ఇండియా ఎస్టీ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు పీవీ రమణ, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రామచంద్రరావు, ఆల్ ఇండియా ఎస్టీ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి హరిరామ్, అసోసియేషన్ ట్రెజరర్ శేషాద్రి, వై శ్రీనివాసులు, యామిని కుమార్, దొరయ్య, జాతీయ కార్యనిర్వాక అధ్యక్షురాలు డాక్టర్ పద్మజ పార్థసారథి పాల్గొన్నారు.