కరోనా ఒక్కరికొస్తే గంటల్లోనే ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది

కరోనా ఒక్కరికొస్తే గంటల్లోనే ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది
  • గాల్లోనూ వస్తుందని గతంలోనే చెప్పా.. ఇప్పుడు లాన్సెట్ చెప్పింది
  • కుటుంబంలో ఒక్కరికొస్తే గంటల్లోనే ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది
  • జూన్ వరకు ఎవరి జాగ్రత్తల్లో వాళ్లుండాల్సిందే
  • లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూ లాంటివి అవసరం లేదు
  • లాక్‌డౌన్ పెడితే కరోనా కంటే ఆకలితోనే ఎక్కువ మరణాలు
  • తెలంగాణ హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు

ప్రస్తుతం కరోనావైరస్ ఫ్యామిలీలో ఒక్కరికి సోకినా.. గంటలోనే కుటుంబం మొత్తానికి సోకుంతుందని తెలంగాణ హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కరోనా నియంత్రణ గురించి శ్రీనివాస రావు కోఠి ఆస్పత్రిలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు.

‘నిన్న సుమారు 5 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళింది. ప్రపంచదేశాలు కరోనాకి మొకరిల్లుతున్నాయి. 100 సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ అనే వైరస్ మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించింది. ఆ వైరస్ మొదటి వేవ్‌లో 30 నుంచి 50 లక్షల మంది చనిపోయారు. రెండో వేవ్‌లో 2 నుంచి 7 కోట్ల మంది మృతి చెందినట్టు సమాచారం. మార్చ్ 24న తెలంగాణలోని ఓ జిల్లాకి మహారాష్ట్ర నుంచి 20మంది ఉత్సవాల కోసం వచ్చారు. మరో 30 మంది తెలంగాణ వాళ్ళు వారికి జత కలిశారు. ఆ తరువాత ఏప్రిల్ 4న వారందరికీ టెస్ట్‌లు చేస్తే అందులో 34 మందికి కరోన వచ్చింది. ఆ తర్వాత వాళ్ల కాంటాక్ట్‌లు అన్నీ కలిపితే 433 మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో ఇదే అతి పెద్ద అవుట్ బ్రేక్. 
 
ఏప్రిల్ 1వ తేదీ నాటికి తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేట్ 1.5 మాత్రమే ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ రేట్ 2.98 శాతానికి పెరిగింది. ఈ వైరస్ కొన్ని గంటల్లోనే కుటుంబ సభ్యులకు కూడా సోకుతోంది. రాష్ట్రంలో డబుల్ మ్యుటేషన్‌లు వచ్చాయి. టెస్ట్‌ల సంఖ్య భారీగా పెంచాం. ప్రైమరీ హెల్త్ కేంద్రాలకు టెస్ట్‌ల కోసం వచ్చే వారిసంఖ్య భారీగా పెరిగింది. గత సంవత్సరం సెప్టెంబర్ 3 నాటికి 18,230 బెడ్స్ వాడాం. అప్పుడు బెడ్ల ఆక్యుపెన్సీ 40 శాతం మాత్రమే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా బెడ్ల సంఖ్యను 38,600కి పెంచాం. రాబోయే రోజుల్లో 53 వేలకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రైవేట్‌లో 5000 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. కొన్ని పెద్ద ఆస్పత్రుల్లో మాత్రమే బెడ్స్ లేవు. కోవిడ్ బాధితుల్లో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండటం లేదు. 5 వేల పడకలతో 44 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటుచేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్, బెడ్స్, మందులు, సిబ్బందికి కొరత లేదు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి చికిత్స పొందాలి. మందులను అతిగా వాడటం మంచిది కాదు. రెమి‌డెసివేర్ వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. మోడరేట్ కరోన లక్షణాలు ఉన్న వారు మాత్రమే రెమిడెసివేర్ వాడాలి. రాబోయే 6 నుంచి 8 వారాలు అంటే జూన్ వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలి. వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని లాన్సెట్ తన జర్నల్‌లో ముందే చెప్పింది. ఇంట్లో ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా 1300లకు పైగా కేంద్రాల్లో వాక్సినేషన్ చేస్తున్నాం. 
గత రెండు రోజులుగా రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది.

ఇప్పటి వరకు 28 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. అందులో 25 లక్షల మందికి మొదటి డోస్ పూర్తి అయింది. మరో 3 లక్షల మందికి రెండో డోస్ కూడా పూర్తి అయింది. నిన్న ఒక్కరోజే 1,70000 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూ లాంటివి అవసరం లేదు. లాక్‌డౌన్ పెడితే కరోనా కంటే ఆకలితోనే ఎక్కువ మరణాలు సంభవిస్తాయి’అని హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు అన్నారు.