జీవో చదవకుండానే సంతకం చేశారా?

జీవో చదవకుండానే సంతకం చేశారా?
  •    భూపరిహారం కోసమని అందులో ఎక్కడా లేదే: హైకోర్టు
  •     సీఎస్​పై నమోదైన ధిక్కార కేసులను వాదించే లాయర్ల ఫీజులకిచ్చినట్లే ఉంది..
  •     జీవో 208లో పేర్కొన్న భాష సరిగ్గా లేదంటూ ఫైర్

హైదరాబాద్, వెలుగు: ‘‘జీవో 208 ఉద్దేశం బాగుంది. కానీ అందులో పేర్కొన్న రూ.58.95 కోట్లు.. భూసేకరణ పరిహార చెల్లింపులకేననే విషయం ఎక్కడా లేదు. సీఎస్ పై కోర్టు ధిక్కార కేసులను వాదించే లాయర్ల ఫీజుల నిమిత్తమే ఆ మొత్తం కేటాయించినట్లుగా ఉంది. అయినా అందులో పేర్కొన్న భాష ఏంటి? జీవో చదవకుండానే సీఎస్‌‌‌‌‌‌‌‌ సంతకం చేశారా?” అని హైకోర్టు మండిపడింది. జీవో 208ని సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా తలకొండపల్లికి చెందిన లెక్చరర్‌‌‌‌‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ పిల్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ హిమాకోహ్లీ, జస్టిస్‌‌‌‌‌‌‌‌ బి.విజయ్‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ని ఏజీ బీఎస్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ గురువారం కోరారు. దీంతో స్పందించిన బెంచ్.. ‘‘జీవో సిద్ధం చేశాక లా డిపార్ట్ మెంట్ లోతుగా పరిశీలన చేస్తే ఇలాంటి అపార్థాలకు ఆస్కారం ఉండేది కాదు. జీవోపై సంతకం చేసే ముందు దాన్ని చీఫ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ పూర్తిగా చదివి ఉన్నా ఇలా జరిగేది కాదు. జీవోను చదివిన తర్వాతే చీఫ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సంతకం చేయాలి కదా?’’ అని ప్రశ్నించింది. సీఎస్‌‌‌‌‌‌‌‌పై కోర్టుధిక్కార కేసుల వాదనలు వినిపించే లాయర్ల ఖర్చుల కోసమే రూ.58 కోట్లు కేటాయించినట్లుగా జీవో 208లో ఉందని చెప్పింది.

పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నరు: ఏజీ

భూసేకరణకు సంబంధించిన పరిహారాలను సకాలంలో చెల్లించలేకపోయామని, పిటిషన్లలోని వారికి డబ్బు చెల్లించేందుకే రూ.58.95 కోట్ల విడుదలకు జీవో జారీ చేశామని హైకోర్టుకు ఏజీ బీఎస్ ప్రసాద్ వివరించారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తప్పుగా అర్థం చేసుకుని హైకోర్టులో పిల్‌‌‌‌‌‌‌‌ వేశారని, దీనిపై మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తే భూపరిహార చెల్లింపులకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయని చెప్పారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తప్పుడు సమాచారం ఇచ్చారని, నిజాలను బుధవారం జరిగిన విచారణ సమయంలో నివేదించలేకపోయినట్లు తెలిపారు. జీవోను చదివిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌.. అందులో వాడిన భాష ఏంటని ప్రశ్నించింది. లీగల్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌ పరిశీలన తర్వాతే జీవో వెలువడుతుందని, ఇలా ఎలా రూపొందించారని తప్పుపట్టింది. జీవో చూస్తే ఆశ్చర్యం వేస్తోందని, భూసేకరణ పరిహారం కోసమే ఆ నిధులు కేటాయించినట్లు ఎక్కడా లేదని కామెంట్ చేసింది. ప్రభుత్వం కోరినట్లుగా అత్యవసరంగా ఇప్పుడు విచారణ చేపట్టలేమని, ఈ నెల 9న లేదా 10న విచారిస్తామని ప్రకటించింది.