- రవాణశాఖాధికారులకుమంత్రి పొన్నం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తీసుకొచ్చిన రవాణా శాఖ సంస్కరణలను మరింత కఠినంగా అమ లు చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రవాణా శాఖలో ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగించాలన్నారు. ఓవర్‌లోడ్ వాహనాలు రెండోసారి రూల్స్ ఉల్లంఘిస్తే వాహన పర్మిట్, డ్రైవర్ లైసెన్స్‌లను రద్దు చేయాలన్నారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత 10 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీలతో 4,748 కేసులు నమోదు చేశా మని, 3,420 వాహనాలను సీజ్ చేశామని మంత్రికి అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.."తనిఖీలు మరింత ముమ్మరం చేయాలి. ఓవర్‌లోడ్ వల్లే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుని, లోడింగ్ పాయింట్ల వద్దే నివారణ చర్యలు తీసుకోవాలి. ఓవర్‌లోడ్ వాహనాలు సీజ్ చేయడంతో పాటు, పదేపదే ఉల్లంఘనలకు వాహన పర్మిట్, డ్రైవర్ లైసెన్స్‌ల రద్దు చేయాలి" అని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
