- జగిత్యాల జిల్లాలో కోమన్‌పల్లి గ్రామంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి గ్రామాల్లో పైలెట్ సర్వే పూర్తి
- తాజాగా ఉమ్మడి జిల్లాలో 280 గ్రామాల్లో సర్వేకు నిర్ణయం
- ఎంజాయ్‌మెంట్ సర్వే చేసి భూ ఆధార్ నంబర్ల కేటాయింపు
- రైతుల భూ వివాదాలకు పరిష్కారం దొరికే అవకాశం
జగిత్యాల, వెలుగు: రైతుల భూములను సమగ్ర డిజిటల్ సర్వే చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కోమన్‌పల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామాల్లో పైలెట్ సర్వేను పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో 70 గ్రామాల చొప్పున ఉమ్మడి జిల్లాలో 280 గ్రామాల్లో సర్వేకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల భూముల పక్కాగా లెక్కలు తీయడం, యాజమాన్య హక్కుల్లో స్పష్టత ఇవ్వడం, పాత రికార్డుల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించడం కోసం ప్రభుత్వం డిటిటల్ సర్వే చేపడుతోంది.
దీనిలో భాగంగా డ్రోన్లతో సర్వే చేసి, జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఈ సర్వే పూర్తయ్యాక ప్రతి భూమికి స్పష్టమైన -మ్యాప్ లభించడంతో పాటు రైతులకు భూధార్ ఐడీ కేటాయించనున్నారు. దీనివల్ల భూ వివాదాలకు చెక్ పడుతుందని అధికారులు చెబుతున్నారు. తాజాగా అధికారుల ప్రణాళిక ప్రకారం తొలి దశలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 70 గ్రామాల చొప్పున మొత్తం 280 గ్రామాల్లో సర్వే చేపట్టేందుకు అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు అందజేశారు. తదుపరి ఆదేశాలు రాగానే సర్వే చేప్టటేందుకు అధికారులు సిద్ధమమయ్యారు.
భూకొలతలు కచ్చితంగా..
గత ప్రభుత్వ కాలంలో ధరణి పోర్టల్లో నమోదైన అనేక భూమి వివరాల్లో పొరపాట్లు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, రాష్ట్ర సర్కార్ ఈసారి ఎంజాయ్‌మెంట్ సర్వే విధానాన్ని అనుసరిస్తోంది. మొదట గ్రామం మొత్తం డ్రోన్లతో చిత్రీకరిస్తారు. ఆపై ప్రత్యేక పరికరాలతో ప్రతి భూమి సరిహద్దులను కొలుస్తారు. విస్తీర్ణం, భూ ఆకారం, పొరుగువారి సరిహద్దులు, అక్షాంశ -రేఖాంశాలన్నీ జియో ట్యాగింగ్ ద్వారా డిజిటల్ రికార్డుల్లోకి వస్తాయి. సర్వే పూర్తయ్యాక ప్రతి గ్రామానికి సమగ్ర భూ-మ్యాప్ (ఎల్‌పీఎం) సిద్ధమవుతుంది. దీని ద్వారా ఒకే భూమికి బహుళ పాస్ బుక్స్ సమస్య పూర్తిగా తొలిగే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి జిల్లాలోనిరెండు గ్రామాల్లో పైలెట్ సర్వే
ఉమ్మడి జిల్లాలో రెండు గ్రామాలను డిజిటల్ సర్వేకు పైలెట్‌గా ఎంపిక చేశారు. జగిత్యాల జిల్లాలో బీర్పూర్ మండలం కోమన్‌పల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో రుద్రంగి మండలకేంద్రాల్లో సర్వే పూర్తిచేశారు. సర్వే నంబర్ల వారీగా హద్దులు ఖరారు చేసి, ఎల్‌పీఎం(భూమ్యాప్)ను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. రైతుల నుంచి స్పందన రావడంతో ప్రాజెక్ట్‌ను విస్తరించే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలకు కొత్తగా సర్వేయర్లు వచ్చారు. డిసెంబర్ తర్వాత మరికొంతమంది వచ్చే అవకాశం ఉండడంతో భూ వివాదాలకు త్వరలోనే చెక్‌పడనుంది.
