- గ్రామాల్లో ‘ఉల్లాస్’ ప్రోగ్రామ్ ద్వారా రాత్రి బడి
- రాష్ట్రంలో13.80 లక్షల మంది మహిళల గుర్తింపు
- రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 77,396 మంది
- చదువు ఆపేసినోళ్లకు ఓపెన్ స్కూలింగ్ లో అడ్మిషన్లు
కరీంనగర్, వెలుగు :
నిరక్షరాస్యులకు చదువు నేర్పేందుకు రాత్రి బడులను రాష్ట్ర ప్రభుత్వం షురూ చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో చదువు చెప్పిస్తోంది. విద్యాశాఖ సహకారంతో మహిళా సంఘాల్లోని చదువుకున్న మహిళలతో రాయడం, చదవడం, అంకెలను గుర్తించడం నేర్పిస్తున్నారు.
చదువుకునేందుకు చాలా మంది మహిళలు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ(ఉల్లాస్) ప్రోగ్రామ్ లో భాగంగా రాష్ట్రంలో 13.80 లక్షల మంది నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 77,396, మహబూబ్ నగర్ జిల్లాలో 75,896 , కరీం నగర్ జిల్లాలో 69,958 మంది చొప్పున ఉన్నారు. వీరితో ఉల్లాస్ యాప్ లో రిజిస్టర్ చేయించారు.
ఎస్సీఈఆర్టీ సహకారంతో రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేకంగా అక్షర వికాసం(వాచకం), మార్గదర్శిని, వర్క్ షీట్లు, క్వశ్చన్ పేపర్లను రూపొందించింది. ఇప్పటికే పుస్తకాల సెట్లు అన్ని గ్రామాలకు చేరాయి.
లక్ష్యానికి మించి రిజిస్ట్రేషన్లు..
నిరక్షరాస్యులైన15 ఏండ్లకుపైన మహిళలను అక్షరాస్యులుగా మార్చేందుకు చేపట్టిన ‘ఉల్లాస్’ ప్రోగ్రామ్ ను అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో సరిపడా సిబ్బంది లేక గతేడాది ప్రారంభించలేదు. ఈసారి ఆ డిపార్ట్ మెంట్ ను తప్పించి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) సహకారం తీసుకోవాల ని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా నిర్ణయించారు.
ఈ ఏడాది రాష్ట్రంలో 12.45 లక్షల మంది మహిళలకు చదువు చెప్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, సెర్ప్ సిబ్బంది 13,80,189 మందిని గుర్తించారు. వీరిలో 13,41,730 మంది మహిళలు రిజిస్టర్ అయ్యారు. లక్ష్యానికి మించి కరీంనగర్ జిల్లాలో 69,958, పెద్దపల్లి జిల్లాలో 51,450 మందిని గుర్తించారు.
ఎక్కువ మంది నిరక్షరాస్యులైన మహిళల్లో రంగారెడ్డి(77,396), మహబూబ్ నగర్(75,896), కరీంనగర్(69,958), జోగులాంబ గద్వాల(66,630), నల్లగొండ(61,630) జిల్లాలు ఉన్నాయి. ఈ స్కీమ్ లో కొన్ని జిల్లాలు మాత్రమే వెనకబడ్డాయి. ఇటీవల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ మెప్మా ఆధ్వర్యంలో నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించారు.
సాయంత్రం నుంచి చదువు..
గ్రామాల్లో నిరక్షరాస్యులైన మహిళలకు సాయంత్రం, రాత్రి వేళల్లో చదవడం, రాయడం, అంకెలు గుర్తించడంతో పాటు చిన్నచిన్న లెక్కలు చేయడం నేర్పిస్తున్నారు. మహిళా సంఘాల్లో ఇంటర్, డిగ్రీ చదివిన మహిళలను విద్యా వలంటీర్లుగా తీసుకుని చెప్పిస్తున్నారు.
రాత్రి బడులను ఎంఈఓ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ బిల్డింగ్స్, స్కూళ్లు, అంగన్ వాడీ కేంద్రాలు, లైబ్రరీలు, కమ్యూనిటీ హాళ్లు, అంబేద్కర్ భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.
ఓపెన్ స్కూలింగ్ లో అడ్మిషన్లు డబుల్..
గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ స్కూలింగ్ లో అడ్మిషన్లు డబుల్ అయ్యాయి. చదువు మధ్యలో ఆపేసిన మహిళలను సెర్ప్ సిబ్బంది గుర్తించి ఓపెన్ టెన్త్, ఇంటర్ లో చేర్పించడం ద్వారానే అడ్మిషన్లు పెరిగినట్టు టాస్ అధికారులు తెలిపారు. ఈసారి ఓపెన్ టెన్త్ లో 35,727 , ఇంటర్ లో 53,248 అడ్మిషన్లు అయ్యాయి. ప్రతి ఏటా 50 వేలకు మించకపోయేవని, ఈసారి 89 వేలకు పెరిగాయన్నారు. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారన్నారు.
