అందెశ్రీ పాటలు అందరినీ ఏకం చేశాయి: మంత్రి పొన్నం
తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర ఏర్పాటులో సబ్బండ వర్ణాలను ఒక్కతాటి మీదకు తీసుకొచ్చి ప్రజల్లో స్ఫూర్తిని నింపింది. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు. ఆయన అకాల మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది.
ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారు: మంత్రి వివేక్
సాహితీవేత్త, లోక కవి అందెశ్రీ ఆకస్మిక మరణం ఎంతో బాధాకరం. ఆయన మరణం తెలంగాణ ప్రజలకు, తెలుగు సాహిత్య ప్రపంచానికి తీరని లోటు. ఆయన నిజమైన జ్ఞానానికి ప్రతీక. ఆయన రచనలు, కవిత్వం, సమాజంపై చిత్తశుద్ధి, భావితరతరాల వారికి నైతిక విలువలను పాటించే మార్గంలో ప్రేరణగా నిలుస్తాయి. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం రూపంలో, జ్ఞాన వ్యాఖ్యల రూపంలో ఆయన చిరంజీవిగా మన హృదయాల్లో నిలిచిపోతారు.
స్వరాష్ట్ర సాధనలో ముక్కోటి గొంతుకయ్యారు: మంత్రి వెంకట్ రెడ్డి
అందెశ్రీ నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం వ్యక్తిగతంగా నన్ను తీవ్రంగా కలచివేసింది. జయ జయహే తెలంగాణ అని ముక్కోటి గొంతుకయ్యారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో వారి కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
లేని లోటు పూడ్చలేనిది : మంత్రి జూపల్లి
అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటంలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచింది. ప్రజా కవిగా అందెశ్రీ ప్రజాకళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివి. వారు లేని లోటు పూడ్చలేనిది. ప్రజా కళలు వర్ధిల్లినంతకాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుంది.
అందెశ్రీ సేవలు మరువలేనివి : మంత్రి సీతక్క
తెలంగాణ ప్రజా సాహిత్యానికి, స్వరాష్ట్ర ఉద్యమానికి అందెశ్రీ అందించిన స్ఫూర్తి, సేవలు అపూర్వం. ఆయన అకాల మరణం సాహిత్య లోకానికే కాకుండా మొత్తం తెలంగాణ సమాజానికి తీరని లోటు. స్వరాష్ట్ర సాధనలో ఆయన రచనలు, గీతాలు ప్రజల్లో చైతన్యం, ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ” గీతం రాష్ట్ర గీతంగా ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా ఆలపిస్తోంది. తెలంగాణ ఉన్నంతవరకు అందెశ్రీ అందించిన చైతన్యం సజీవం.
సాహిత్య ప్రపంచానికి తీరని లోటు: సురేఖ
తెలంగాణ బుద్ధిజీవి, ప్రముఖ రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ ఆకస్మిక మరణం తెలంగాణకు, రాష్ట్ర సాహిత్య ప్రపంచానికి తీరని లోటు. ఆయన తన స్వహస్తాలతో రాసిన జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని తెలంగాణ ఉద్యమ భావోద్వేగాన్ని సజీవంగా ఉంచింది.
తెలంగాణకు తీరని లోటు: మంత్రి దామోదర
అందెశ్రీ అకాల మరణం తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణంతెలంగాణ సమాజానికి తీరని లోటు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
తెలంగాణ ఆవిర్భావంలో కీలక పాత్ర: మంత్రి పొంగులేటి
తెలంగాణ ఆవిర్భావంలో అందెశ్రీ రచనలు, గానం కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు.
మహాకవిని కోల్పోయాం: మంత్రి అడ్లూరి
ఓ మహాకవిని కోల్పోయాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర గొప్పది. తెలంగాణ ప్రజల మనోభావాలను పాటల రూపంలో తెరపైకి తెచ్చారు. అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది.
ఉద్యమాలవైపు నడిపించిన కవి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో సమాజంలోని అన్ని వర్గాలను కదిలించి ఉద్యమం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించించిన గొప్ప వ్యక్తి అందెశ్రీ. ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ తెలంగాణ ఉద్యమానికి ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో తెలంగాణ సమాజానికి చెప్పాలనుకున్న విషయాన్ని రాజీ పడకుండా విస్పష్టంగా చెప్పారు. జీవితాంతం తెలంగాణ కోసమే పనిచేసిన సౌమ్యుడు.
అరుదైన కవి: బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్ రావు
అందెశ్రీ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన అరుదైన కవి. ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. ఇటీవల ఢిల్లీలో కలిసినప్పుడు ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. అందెశ్రీ మరణవర్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.
సేవలు చరిత్రలో నిలిచిపోతాయి: కేటీఆర్
అందెశ్రీ సేవలు, రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని చేకూర్చాలి.
ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి: కోదండరాం
తన కోసం కాకుండా ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి అందెశ్రీ. ఆయన వస్తే అప్పట్లో మీటింగ్ లు సక్సెస్. ప్రతి మీటింగ్ ను జయ జయహే తెలంగాణ పాటతో ప్రారంభించేవాళ్లం. జై బోలో తెలంగాణ పాట ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు స్ఫూర్తి నిచ్చారు. పలకా బలపం పట్టని వ్యక్తి తెలంగాణ రాష్ట్ర గీతం రాశాడు. అది అందెశ్రీ గొప్పతనం.
అందెశ్రీ సాహిత్యాన్ని చదవడమే నిజమైన నివాళి: వేములు శ్రీనివాసులు సీఎం ఓఎస్డీ
అందెశ్రీ సాహిత్యాన్ని అందరూ చదవడమే నిజమైన నివాళి. అందెశ్రీ మహాకవి మాత్రమే కాదు. మహా మనిషి. ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడి, సత్యాన్ని ఆచరించి, తన కవిత్వంలో కూడా ఎలాంటి అంతరాలు లేకుండా సత్యారాధన చేసిన గొప్పవ్యక్తి. ప్రకృతిని, అమ్మవారిని అమితంగా ప్రేమించేవారు. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు.
కోటిలో ఒక్కడిలా ఉండే వ్యక్తి: అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ
అందెశ్రీ మరణం ఉహించనిది. తెలంగాణ పునర్నిర్మాణం లో నా కృషి ఎప్పుడు ఉంటది అని అందెశ్రీ అనేవారు. అందెశ్రీ కళాకారుడే కాదు.. ఒక రాజకీయ జ్ఞాని. ఈ రోజుల్లో రెండు పాటలు క్లిక్ అవ్వగానే రాయల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అలాంటిది ఎన్నో ఏండ్లుగా గుర్తింపు ఉన్న అందెశ్రీ ప్రజల పక్షాన ఉన్నారు. అందెశ్రీ లాంటి కవి, వ్యక్తితం ఉన్న వారు మళ్లీ పుట్టరు.
సమాజానికి తీరని లోటు: కోదండ రెడ్డి
రాష్ట్రంలో ప్రజలను చైతన్య పరచడంలో అందెశ్రీ తనదైన శైలిలో పాటలు రాశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యువతను చైతన్య పరచడంలో అందెశ్రీ కీలకపాత్ర పోషించారు. 1969 ఉద్యమంలో, మలి దశ ఉద్యమంలో అందెశ్రీ అందించిన సేవలు మరువలేనివి. తెలంగాణ రాష్ట్రంలో అందెశ్రీని స్మరించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కృషి చేస్తాం.
అందెశ్రీ తెలంగాణ సాహిత్యానికి ప్రాణం: మందుల సామేల్, తుంగతుర్తి ఎమ్యెల్యే
తెలంగాణ ఉద్యమంలో నేను, అందెశ్రీ కలిసి పనిచేశాం. ప్రజాపాలనలో అందెశ్రీని, తెలంగాణ సాహిత్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. కళాకారులకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇచ్చాం. తెలంగాణ సాహిత్యానికి అందెశ్రీ ప్రాణం లాంటి వారు. వారి ఆకస్మిక మరణం తీరని లోటు.
పాటలే అందెశ్రీని అమరజీవిగా నిలబెట్టాయి: కాసర్ల శ్యామ్, సినీ గేయ రచయిత
అందెశ్రీతో ఎన్నో ఏండ్ల అనుబంధం ఉంది. ఉద్యమ సమయంలో రాసిన పాటలతో పాటు మనిషితనాన్ని ప్రశ్నించడం, కులవృత్తులపై రాసిన పాటలు ప్రత్యేకంగా నిలిచాయి. ఏ పాట రాసినా ఆయన మార్క్ ఉంటుంది. అందెశ్రీ రాసింది పిడికెడు పాటలైనా ఆయనను అమరజీవిలా నిలబెట్టాయి.
సాహితీ లోకానికి తీరని లోటు: స్పీకర్ గడ్డం ప్రసాద్
వికారాబాద్, వెలుగు: ప్రముఖ ప్రజాగాయకుడు అందెశ్రీ అకాల మరణంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావంలో ఆయన రచనలు, గానం కీలక పాత్ర పోషించాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని చెప్పారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
సహజ కవి అందెశ్రీ : బండి సంజయ్
నిరంతరం పేదల అభ్యున్నతి, తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి అందెశ్రీ. ఆయన రచించిన "మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, జయజయహే తెలంగాణ" గీతాలు మరువలేనివి. అందెశ్రీ మనకు భౌతికంగా దూరమైనా.. ఆయన రాసిన పాటల రూపంలో సజీవంగానే ఉంటారు.
మహానుభావుడిని కోల్పోయాం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు. ఆయన ఆకస్మిక మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసింది. తెలంగాణ సాహితీ లోకంలో ఒక మహానుభావుడిని, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కవిని కోల్పోయాం. “జయ జయహే తెలంగాణ” పాట ద్వారా తెలంగాణ చరిత్రలో అందెశ్రీ సేవలు మరువలేనివి.
