- 2020లో కరోనా వల్ల బ్యాలెట్ పేపర్లను వినియోగించిన సర్కారు
- అంతకుముందు 2014లో ఈవీఎంలతోనే మున్సిపల్ ఎన్నికలు
- ఈసారి మళ్లీ బ్యాలెట్ పేపర్ వైపే ప్రభుత్వం మొగ్గు
- 7,500 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశం
- బ్యాలెట్ పేపర్ కోసం కంపెనీలకు ముందస్తు ఆర్డర్లు
- 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికలు
- నేడు మున్సిపల్ ఆఫీసుల్లో ఆల్ పార్టీ మీటింగ్స్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ తోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికలు జరిగే117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పరిధిలో బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, మున్సిపల్ ఆఫీసర్లు బ్యాలెట్ పేపర్ కోసం పేపర్ కంపెనీలకు ముందస్తు ఆర్డర్లు పంపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు.. వెంటనే ముద్రించి అందించేలా పేపర్ ను రెడీ చేసి పెట్టుకోవాలని ఆదేశించారు. 2014లో మున్సిపల్ ఎన్నికలను ఈవీఎంలతోటే అప్పటి సర్కారు నిర్వహించింది. తర్వాత 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పేపర్‌తో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.
ఈసారి ఈవీఎంలతో నిర్వహించే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రభుత్వం బ్యాలెట్ వైపే మొగ్గు చూపింది. రాష్ట్రవ్యాప్తంగా 124 మున్సిపాలిటీలు 9 గ్రేటర్ కార్పొరేషన్లు ఉండగా వీటిలో గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూర్, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీల పాలవర్గాల గడువు వచ్చే ఏడాది మే వరకు ఉన్నది. ఇవి కాక మందమర్రి, మణుగూరు మున్సిపాలిటీలు షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నవి.
ఈ పది చోట్ల మినహా ఇంకా మిగిలిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు ఈ ఏడాది జనవరిలోనే ముగిసింది. ప్రస్తుతం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. ఇప్పటికే 117 మున్సిపాలిటీల పరిధిలో 2,630, ఆరు కార్పొరేషన్ల పరిధిలో 366 వార్డులను ఎలక్షన్ కమిషన్ ఫైనల్ చేసింది. అన్ని చోట్ల కలిపి 52.71 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లుగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి, అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.
7,500 బ్యాలెట్ బాక్స్‌లు..
ఫైనల్ అయిన వార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,500 వరకు బ్యాలెట్ బాక్స్‌లు అవసరం ఉన్నట్లుగా ఆఫీసర్లు గుర్తించారు. ఒక్కో వార్డుకు రెండు చొప్పున మున్సిపాలిటీలలో 5,260 బాక్స్‌లు అవసరం కాగా మరో 940 అదనంగా, కార్పొరేషన్లలో 732 బాక్స్‌లు అవసరం కాగా 568 అదనంగా రెడీ చేస్తున్నారు. ఈ బాక్స్‌లతో పాటు బ్యాలెట్ పేపర్ సిద్ధం చేసుకోవడానికి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ శాఖ ఆఫీసర్లు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ప్రీ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మున్సిపల్ శాఖ ఆఫీసర్లు చేస్తున్నారు. స్టేషనరీ, పేపర్ ముద్రణ కోసం ఆయా పేపర్ కంపెనీలు, ముద్రణా కార్యాలయాలకు ఆర్డర్ పంపించారు. ఇండెలిబుల్ ఇంక్, పోలింగ్ కిట్స్ వంటి మెటీరియల్ సేకరణకు ఆర్డర్స్ ఇచ్చారు.
నేడు ఆల్ పార్టీ నేతల మీటింగ్స్
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఎన్నికలు నిర్వహించబోయే117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఆల్ పార్టీ నేతల మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మున్సిపాలిటీల పరిధిలో ఉండే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పొలిటి కల్ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపించారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్లలో ఆల్ పార్టీ మీటింగ్స్ నిర్వహించనున్నారు. అనంతరం జనవరి10న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా వార్డులు, పోలింగ్ స్టేషన్ల ప్రకారం ఫైనల్ ఓటర్ లిస్టులు ప్రకటిస్తారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్లు, సెక్టార్ ఆఫీసర్ల నియామకం కోసం ఉద్యోగుల జాబితా సిద్ధం చేస్తున్నారు.
